Lebanon: లెబనాన్లో కొనసాగుతున్న బాంబుల మోత..

హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యం చుక్కలు చూపిస్తున్నది. 2006 తర్వాత అత్యంత భీకరంగా సోమవారం దాదాపు 300 లక్ష్యాలపై దాడులు జరిపింది. ఇందులో 274 మంది మరణించగా, సుమారు 1,000 మంది గాయపడ్డారు. హెజ్బొల్లాపై గగనతలం నుంచి విరుచుకుపడతామని, ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని దక్షిణ, తూర్పు లెబనాన్ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. హెజ్బొల్లా ఆయుధాగారాలపై దాడులు చేస్తామని చెప్పింది. దీంతో ప్రజలు లెబనాన్ రాజధాని నగరం బీరుట్ వైపు హుటాహుటిన కార్లు, తదితర వాహనాల్లో పరుగులు తీశారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి గత మంగళవారం పేజర్ల పేలుళ్లు జరిగే వరకు ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 600 మంది లెబనాన్ ప్రజలు మరణించారు. వీరిలో 100 మందికిపైగా సాధారణ ప్రజలు. మరిన్ని దాడులు చేయడానికి సైనిక ప్రధాన కార్యాలయం నుంచి ఆమోదం లభించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గలీలీలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించామని హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ చర్యలు సమూల నాశనం కోసం యుద్ధంతో సమానమని లెబనాన్ ప్రధాన మంత్రి ఆరోపించారు.
హమాస్ చీఫ్ మృతి?
అక్టోబర్ 7 నాటి దాడుల రూపకర్త, హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా అతడి కదలికలు లేకపోవటంతో అతడు సజీవంగా ఉండకపోవచ్చునని భావిస్తున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com