Israeli – Hamas War: పొరపాటుగానే బందీలపై కాల్పులు.. విషాదమన్న నెతన్యాహు

Israeli – Hamas War:  పొరపాటుగానే  బందీలపై కాల్పులు.. విషాదమన్న నెతన్యాహు
సొంత బందీలను చంపిన ఇజ్రాయెల్​- శత్రువులుగా పొరపాటుపడ్డామన్న సైన్యం

గాజాలో హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులు గురి తప్పుతున్నాయి. IDF దాడుల్లో ప్రజల ఆస్తులతోపాటు ప్రాణాలు పోతున్నాయని ఆరోపణలు ఉండగా తాజా ముగ్గురు బందీలను కాల్చి చంపటంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో నిరసనలు ఎగిసిపడుతున్నాయి.

హమాస్‌ను సమూలంగా నిర్మూలించటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. IDF దాడుల్లో పౌరులు చనిపోతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌ సైన్యం ముగ్గురు బందీలను కాల్చిచంపింది. శత్రువులుగా భావించి ముగ్గురు బందీలను కాల్చి చంపినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళం-IDF ప్రకటించింది. షెజైయాలో హమాస్‌ అంతమే లక్ష్యంగా జరిపిన దాడుల్లో ముగ్గురు బందీలు మరణించినట్లు వెల్లడించింది. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తంచేసిన ఐడీఎఫ్‌ జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందినవారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫార్‌ అజా, మరొకరు కిబుట్జ్‌ నిర్‌ అమ్‌ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించినట్లు IDF తెలిపింది. మూడో వ్యక్తి వివరాలు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచినట్లు వెల్లడించింది. ఈ దారుణ ఘటనకు....నిరసనగా ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీల్‌లో ఆందోళనలు చెలరేగాయి. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నవారి బంధువులు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


మరణించిన బందీలకు సంతాపం తెలిపిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ముగ్గురు బందీల మృతి పట్ల తాను దుఃఖిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇది తీవ్రమైన విషాదకర ఘటనగా శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ విచారం వ్యక్తం చేశారు. బందీలపై కాల్పులకు దోహదం చేసిన పరిస్థితులపై ఇజ్రాయెల్ విచారణ జరుపుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌పై...ఇజ్రాయెల్‌ సైన్యం జరిపినదాడిలో తమ కెమెరామెన్‌ మరణించినట్లు అల్‌ జజీరా ఛానల్‌ ప్రకటించింది. తమ ప్రధాన కరస్పాండెంట్‌ గాయపడ్డారని వెల్లడించింది. ఓ పాఠశాలలో వారు రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలో డ్రోన్‌ దాడి జరిగినట్లు పేర్కొంది. హమాస్‌-ఇజ్రాయెల్ యుద్ధం మెుదలైనప్పుటి నుంచి ఇప్పటివరకు 64మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. ఇందులో 57 మంది పాలస్తీనియన్లు, నలుగురు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్ జర్నలిస్టులు మరణించినట్లు వెల్లడించింది

Tags

Read MoreRead Less
Next Story