Israel-Hamas: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. ఈ మేరకు అక్కడి అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. మృతుల్లో 21 మంది మహిళలే కావడం గమనార్హం. ఈ దాడుల్లో కనీసం 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని పోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు, ఇజ్రాయెల్‌పై సిరియా వైమానిక దాడులకు యత్నించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అది తమ భూభాగంలోకి ప్రవేశించకముందే దాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. ఇరాన్ మద్దతుతోనే సిరియా ఈ డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com