Israel-Lebanon War: కాల్పుల విరమణ కుదిరిన గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్దిగంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 250 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ అంగీకరించింది. అయితే ఈ ఒప్పందం తమకు వర్తించదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
ఒప్పందం వెంటనే యుద్ధం మళ్లీ రగిలింది
కాల్పుల విరమణతో పరిస్థితి ప్రశాంతంగా మారుతుందని భావించినప్పటికీ, ఇజ్రాయెల్ చర్యలతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.
లెబనాన్‌పై భారీ దాడులు
బీరుట్, బెకా లోయ ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాలపై జరిగిన దాడుల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భవనాలు కూలిపోవడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హిజ్బుల్లా కూడా ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడులు ప్రారంభించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన
ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఒప్పందం కుదిరిన వెంటనే ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరమని యూఎన్ మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ చర్యలను తప్పుబట్టాయి.
మళ్లీ పెరిగిన చమురు ధరలు
కాల్పుల విరమణ వార్తతో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు, తాజా దాడుల తర్వాత మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 97 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. మొత్తంగా, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పశ్చిమాసియాలో శాంతి ఇంకా దూరంగానే ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


