Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ స్థావరాలపై దాడులు

గాజాపట్టీపై భూతల, వాయు మార్గాల్లో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు సముద్రంలోనూ జల్లెడపడుతోంది. గాజా తీర ప్రాంతంలో ఇజ్రాయెల్ మిలటరీ చేపట్టిన అండర్‌వాటర్ మిషన్లలో హమాస్ మిలిటెంట్లు ఉపయోగించే ఆయుధాలు భారీగా బయటపడ్డాయి. హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలపై 4 వేల 300 వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది.
గాజాపట్టీలో హమాస్ మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా వేట కొనసాగిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉత్తర గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ మిలటరీ అక్కడ ఉన్న హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. సొరంగాల నెట్‌వర్క్‌ను బాంబులతో నాశనం చేస్తోంది. తాజాగా సముద్రంలోనూ హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన ఆయుధాలను ఇజ్రాయెల్ కనుగొంది. అందుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. గాజా తీరంలోని సముద్ర జలాల్లో హమాస్‌కు చెందిన ఆయుధాలు పదుల సంఖ్యలో బయటపడ్డాయి. అండర్‌వాటర్ మిషన్స్‌లో భాగంగా తనిఖీలు చేపట్టగా హమాస్ ఉపయోగించిన ఆయుధాలు భారీ సంఖ్యలో బయటపడినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది.
మరోవైపు ఉత్తర గాజాలో భీకర పోరు సాగుతోంది. హమాస్‌కు చెందిన స్థావరాలపై 4 వేల 300 వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. హమాస్ సొరంగాలు, కమాండర్ సెంటర్లపై ఈ దాడులు జరిగాయి. ప్రస్తుతం గాజా నగరంలోని ఆస్పత్రుల వద్ద భీకర పోరు సాగుతోంది. గాజాపట్టీ మొత్తం జనాభా 23 లక్షలుకాగా అందులో ఉత్తరగాజాలో సగం మందికిపైగా ఉండేవారు. ఉత్తరగాజాను వీడాలని ఇజ్రాయెల్ హెచ్చరికతో ఇప్పటికే లక్షలాది మంది దక్షిణగాజాకు తరలిపోయారు. తాము ఉత్తరగాజాలోకి ప్రవేశించిన తర్వాత 2 లక్షల మంది గాజా నగర పౌరులను దక్షిణ గాజా వెళ్లేందుకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com