ISRAEL: శిథిలాల దిబ్బను తలపిస్తున్న గాజా

నెలరోజులకుపైగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో గాజా శిథిలాల దిబ్బను తలపిస్తోంది. తీవ్రమైన మానవ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తున్నా నెతన్యాహు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఇజ్రాయెల్ సేనలు గాజాపై పెద్దఎత్తున వైమానిక, భూతలదాడులు చేస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యమని చెబుతున్నా నెతన్యాహు సేనల దాడుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. వారికి చెందిన మౌలిక వసతులు కూడా నేలమట్టవుతున్నాయి. పట్టణ జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి నెతన్యాహు సేనలు చొచ్చుకుపోయి దాడులు చేస్తున్నాయి. మూడు ఆస్పత్రుల సమీపంలో ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఉత్తరగాజాలో ఇజ్రాయెల్ దాడులు ఉద్ధృతం చేయటంతో అక్కడి ప్రజలు బతుకుజీవుడా అంటూ కట్టుబట్టలతో తమ కుటుంబాలతో దక్షిణ గాజాకు తరలిపోతున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున షిఫా ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రసూతి విభాగంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు హమాస్ ఆధ్వర్యంలో నడిచే మీడియా సెంటర్ వెల్లడించింది. ఆస్పత్రి ప్రాంగణంలో మంటలు చెలరేగడంతో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలు భయంతో చేస్తున్న అరుపులు ఆ తర్వాత అంబులెన్స్‌ల శబ్దాలు అక్కడ రికార్డ్ చేసిన వీడియోలో నమోదయ్యాయి. మూడు ఆస్పత్రుల సమీపంలో దాడులు జరిగినట్లు హమాస్ ప్రతినిధులు అల్‌జజీరా ఛానల్‌కు తెలిపారు. అయితే ఎంతమంది చనిపోయారో వెల్లడించలేదు. షిఫా ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఓ వ్యక్తి చనిపోగా పదులసంఖ్యలో గాయపడినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
హమాస్ ఫైటర్లు ఆస్పత్రుల్లో నక్కారని, షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌ను ప్రధాన కమాండ్ సెంటర్‌గా మార్చుకున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ వాదనను ఆస్పత్రి ఉద్యోగులు, హమాస్ నేతలు తోసిపుచ్చారు. ఆ సాకుతో ఇజ్రాయెల్ విచ్చలవిడిగా దాడులు చేస్తోందని ఆరోపించారు. ఉత్తరగాజాలో నివాసాలు, ఐరాస శిబిరాలపై ఇజ్రాయెల్ సేనలు పలుమార్లు దాడులుచేయటంతో సురక్షితమని భావించి షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ప్రజలు తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సేనలు షిఫా ఆస్పత్రికి 3కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఇజ్రాయెల్ కమాండర్ తెలిపారు. అక్టోబర్ ఏడున తమదేశంపై జరిపిన మెరుపు దాడుల్లో పాల్గొన్న హమాస్ ప్లాటూన్ కమాండర్, మరో కమాండర్ సహా 19మంది మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 20 రాకెట్ లాంచర్లు ఉన్న షిప్పింగ్ కంటెయినర్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు పాలస్తీనాకు చెందిన 10వేల 8వందల మంది చనిపోయినట్లు గాజాలోని వైద్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతుల్లో పౌరులు, హమాస్ మిలిటెంట్లు ఎంతమంది ఉన్నారో వెల్లడించలేదు. మరో 2వేల 6వందల 50మంది అచూకీ లేదని, వారు చనిపోయారో లేదా భవన శిథిలాల కింద చిక్కుకుపోయారో తెలియదని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com