Israel-Hamas: అర్ధరాత్రి ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యం

ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెట్టి యుద్ధ ట్యాంకులతో దాడులు నిర్వహించాయి. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. ఇజ్రాయెల్ సైన్యం...గాజాలోకి అడుగుపెట్టేందుకు లైన్‌క్లియర్ చేయడానికి వీలుగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఉత్తరగాజాలోకి చొరబడి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైమానిక దాడులతో రెండు వారాలుగా గాజాలో వందలాది టార్గెట్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గాజాస్ట్రిప్‌లో ఇంధనం ఖాళీ అవుతోందని ఐరాస హెచ్చరించిన వేళ ఇజ్రాయెల్ ఈ భూతల దాడులు చేయడం గమనార్హం.
యుద్ధం తదుపరి దశకు సిద్ధమయ్యేందుకు గాజాలోని కొన్ని టార్గెట్లపై భూతల దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. గాజాలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేపట్టిన అతిపెద్ద భూతల దాడి ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌లో హమాస్ మెరుపుదాడులు తర్వాత గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా రూపుమాపుతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఉత్తరగాజాను ఖాళీ చేయాలని కొన్ని రోజుల క్రితమే అక్కడ ఉన్న ప్రజలను హెచ్చరించింది. ఇప్పటికే 11 లక్షల మంది ఉత్తరగాజాను వీడి దక్షిణగాజాకు తరలివెళ్లారు.
పూర్తిస్థాయిలో భూతల దాడి ఎప్పుడు మొదలవుతుందో ఇజ్రాయెల్ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ పౌరుల కోసం కూడా ఆ దేశం వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే గాజాలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విమానం నుంచి జార విడిచింది. బందీలను మిలిటెంట్లు ఎక్కడ దాచారో కచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతి ఇస్తామని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని, వారి వివరాలను బయటపెట్టబోమని ఇజ్రాయెల్ తెలిపింది.
మరోవైపు సముద్ర మార్గంలో ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాలని యత్నించిన హమాస్ మిలిటెంట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF తెలిపింది. జకిమ్ ప్రాంతం వద్ద సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. వాయు, సముద్ర, భూతల మార్గాల్లో హహస్ మిలిటెంట్లపై దాడి చేసినట్లు తెలిపింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com