Israel-Hamas: ఇజ్రాయెల్‌ సైన్యంపై హమాస్‌ ఆర్‌పీజీ లాంచర్‌

Israel-Hamas: ఇజ్రాయెల్‌ సైన్యంపై హమాస్‌ ఆర్‌పీజీ లాంచర్‌
యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ..

మూడున్నర నెలలుగా హమాస్‌తో సాగిస్తున్న భీకర పోరులో ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌ మిలిటెంట్లు చేసిన దాడిలో ఇజ్రాయెల్‌ సైన్యానికి భారీగా ప్రాణ నష్టం జరిగింది. హమాస్‌ మిలిటెంట్లు ఆర్‌పీజీ లాంచర్‌ను ప్రయోగించడంతో 21 మంది సైనికులు మృతి చెందినట్లు...... ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సెంట్రల్ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు..తమ సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతుండగా సమీపంలోని ట్యాంక్‌పైకి హమాస్‌ గ్రనేడ్‌ను ప్రయోగించిందని తెలిపింది. గ్రనేడ్‌ ధాటికి మందుగుండు పేలడంతో.. భవనాలు తమ సైనికులపై కూలడంతో భారీ ప్రాణనష్టం జరిగిందని వెల్లడించింది. యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించడం ఇదే తొలిసారి అని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

తమ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గడం లేదు. హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు హమాస్‌ పై దాడులు చేస్తూనేమరోవైపు లెబనాన్‌లోని హిజ్బోల్లా ఉగ్రవాద స్థావరాలపై రాకెట్లతో విరుచుపడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసింది. మూడున్నర నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. 62 వేల మందికిపైగా గాయపడినట్లు.. వెల్లడించింది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 178 మంది మరణించినట్లు వెల్లడించింది.


ఇజ్రాయెల్‌- హమాస్ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడిని హమాస్‌ సమర్థించుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తాము కాల్పులు జరిపినట్టు హమాస్‌ వ్యాఖ్యానించింది. తమ భవిష్యత్‌ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని తెలిపింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న కుట్రలను ఎదుర్కొనేందుకు తాము దాడి చేసినట్లు వెల్లడించింది.

ఈ మేరకు 16 పేజీల లేఖను విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. గాజా స్ట్రిప్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను హమాస్‌ కోరింది. గాజాలో పాలస్తీనియన్లు ఆహార కొరతతో ఆకలితో అలమటిస్తున్నారని వారికి సాయం చేయాలని.. అర్ధించింది. యుద్ధం ముగించేవరుకు ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపేదే లేదని హమాస్‌ స్పష్టం చేసింది.

అటు యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చెప్పారు. హమాస్‌ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని నెతన్యాహు వెల్లడించారు

Tags

Read MoreRead Less
Next Story