Myanmar Earthquake: మ‌య‌న్మార్‌లో భూకంప విధ్వంసం.. ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో శాటిలైట్‌

Myanmar Earthquake: మ‌య‌న్మార్‌లో భూకంప విధ్వంసం.. ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో శాటిలైట్‌
X
శిథిల నగరంగా మారిపోయిన మండేలా

మయన్మార్‌లో మార్చి 28న రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటి వరకూ కనీసం 1700 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. అయితే, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో లెక్కేలేదు. భూకంపం సంభవించి నాలుగు రోజుల గడిచిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలు కుళ్లిపోయి.. దుర్గంధం వెదజల్లుతోంది. తమవారు సజీవంగా వస్తారనే ఆశలు బాధిత కుటుంబాల్లో సన్నగిల్లుతున్నాయి. ఎటుచూసి శిథిలాలే.. కన్నీటి వ్యతలే కనిపిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో భారీ యంత్రాలు సాయం లేకుండానే స్థానికులు.. ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మండేలాలో భూకంప విలయం తీవ్రంగా ఉంది. అక్కడ ప్రజలు వీధుల్లోనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వరుస భూకంపాలు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆదివారం కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అయితే, మయన్మార్‌ భూకంప విధ్వంసాన్ని ఉపగ్రహ ఫోటోలు కళ్లకుకడుతున్నాయి. రోడ్లు, విమానాశ్రయాలు, వంతెనలు, భవనాలు సహా మౌలిక సదుపాయాలు ఏంతలా ధ్వంసమయ్యాయే చూపుతున్నాయి.

మండలే న‌గ‌రంలో ఉన్న అనేక క‌ట్ట‌డాల‌కు భారీ న‌ష్టం జ‌రిగిన‌ట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా తెలుస్తోంది. ఆ న‌గ‌రంలో ల్యాండ్‌మార్క్ ప్ర‌దేశాలైన స్కై విల్లా, ఫ‌యాని ప‌గోడ‌, మ‌హాముని ప‌గోడ‌, ఆనంద ప‌గోడ‌, మండ‌లే యూనివ‌ర్సిటీతో పాటు అనేక ప్రాంతాల్లో పూర్తి ధ్వంస‌మ‌య్యాయ‌ని, సాగేయింగ్ సిటీలో ఉన్న మా షి ఖానా ప‌గోడ‌తో పాటు బౌద్ద ఆల‌యాలు, ఇత‌ర బిల్డింగ్‌లు కూలిన‌ట్లు ఇస్రో ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.

Tags

Next Story