USA: అమెరికాలో ఐటీ నిపుణుల కొరత

అమెరికాలో ఐటీ నిపుణుల కొరత తీవ్రంగా ఉందా, నిపుణుల కొరతతో కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. అమెరికాలో దాదాపు 2,100 చిన్న, మధ్యశ్రేణి సంస్థలు భాగస్వాములుగా ఉన్న ఐటీ సర్వీస్ సంఘం ఈ విషయాన్ని వెల్లడించింది. నిపుణుల నియామకానికి వీసాల సంఖ్యను పెంచాలని బైడెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
నిపుణుల కొరత తీవ్రంగా ఉండటంతో హెచ్-1బీ వీసాల కోటాను 65,000 నుంచి రెట్టింపు చేయాలని 2,100 చిన్న, మధ్య శ్రేణి ఐటీ కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వీటిల్లో భారతీయులు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి.
ఒక దేశానికి చెందిన పౌరులు మరో దేశాన్ని సందర్శించాలంటే అనుమతి పత్రం కావాలి. అటువంటి అనుమతి పత్రాన్నే వీసా అంటారు. ఇక అక్కడ తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు.
అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో నిపుణుల కొరత అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్లకు తెలియజేయాలని నిర్ణయించారు. నిపుణుల కొరత తమ వ్యాపారం, అమెరికా అభివృధ్దిపై ప్రభావం చూపిస్తోందని వారు పేర్కొన్నారు. లక్షా 30 వేల హెచ్1బీ వీసాలు జారీచేయాలని కోరడంతోపాటు.. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం స్టెమ్ విద్యపై పెట్టుబడులు పెంచాలని కోరారు. ఫలితంగా స్థానికంగా నిపుణులను తయారు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com