Giorgia Meloni: అత్యంత ప్రభావవంతమైన పొలిటికల్ నేతగా ఇటలీ ప్రధాని

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మరో ఘనత సాధించారు. ఇటలీ చరిత్రలో ఒక మహిళ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఘనత ఆమెకే దక్కుతుంది. తాజాగా మరో ఘనత సాధించారు. ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన పొలిటికల్ వ్యక్తుల్లో ఆమె అగ్ర స్థానంలో నిలిచారు. తాజా ర్యాంకింగ్‌లో 28 మంది వ్యక్తుల జాబితాలో మెలోని అగ్రస్థానంలో నిలిచారు.
జార్జియా మెలోని ఇటాలియన్ రాజకీయ నాయకురాలు. అక్టోబరు 2022 నుంచి ఇటలీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటాలియన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళ ఈమె కావడం విశేషం. 2006 నుంచి ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్ సభ్యురాలిగా వ్యవహరించారు. 2014 నుంచి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి నాయకత్వం వహించారు. 2020 నుంచి యూరోపియన్ కన్జర్వేటివ్స్ , రిఫార్మిస్ట్స్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు.
2008లో ఆమెకు ఇటలీ ప్రభుత్వంలో యువజన శాఖ మంత్రి పదవి లభించింది. దీంతో ఇటలీ రాజకీయాల్లో అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించింది. 2012 వరకూ ఆమె ఉన్న రాజకీయ పార్టీ సంక్షోభంలోకి జారిపోవడంతో దాన్ని విభజించి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీని మరో ఇద్దరు రాజకీయ సహచరులతో స్థాపించింది. 2014లో దానికి అధ్యక్షురాలయ్యారు. 2014లో జరిగిన యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లోనూ, 2016లో జరిగిన రోమ్ పురపాలక ఎన్నికల్లోనూ ఆమె పోటీచేసి ఓడిపోయారు.
2018 ఇటాలియన్ సాధారణ ఎన్నికల తర్వాత శాసనసభకు ఎంపికై బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకురాలిగా నేతృత్వం వహించారు. క్రమేపీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రజాదరణ పెంచుకుంటూ వచ్చింది. 2022 ఇటాలియన్ సాధారణ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ విజయం సాధించింది. దీంతో ఆమె ఇటలీ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
ఇక మెలోని.. అన్ని దేశాల ప్రధానమంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రధానమంత్రులు ఎక్కడ కలుసుకున్నా.. ఆపాయ్యంగా పలకరిస్తుంటారు. భారత్‌తో కూడా మెలోనికి మంచి సంబంధాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com