JACK MA: పాకిస్థాన్‌లో జాక్ మా రహస్య పర్యటన

అలీబాబా వ్యవస్థాపకుడు, చైనా కుబేరుడు జాక్ మా అత్యంత రహస్యంగా పాకిస్థాన్‌లో పర్యటించడం ప్రకంపకనలు రేపుతోంది. జూన్ 29న పాక్ వచ్చిన ఆయన 23 గంటల పాటు లాహోర్‌లో మకాం వేయడం సంచలనం సృష్టించింది. ఎలాంటి సమాచారం లేకుండా గోప్యంగా జరిగిన ఈ పర్యటన వెనక ఉద్దేశాలపై ఆసక్తి నెలకొంది. జాక్ మా పాక్‌లో పర్యటించిన విషయం వాస్తవమేనని ఆ దేశ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ మాజీ ఛైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ అహ్సన్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, మీడియాతో చర్చలకు జాక్ మా దూరంగా ఉన్నారని తెలిపారు. జాక్ మా ప్రైవేట్ ప్రదేశంలో బస చేశారని వివరించాడు. జూన్ 30న ప్రైవేట్ జెట్‌లో తిరిగి వెళ్లిపోయాడని ఆయన పేర్కొన్నారు. జాక్ మా పర్యటన రహస్యమైనా రాబోయే రోజుల్లో అది తమ దేశానికి సానుకూల ఫలితాలను ఇస్తుందని అహ్సన్ తెలిపారు.
జాక్ మా బృందంలో ఐదుగురు చైనా జాతీయులు..జర్మనీ, అమెరికాకు చెందిన ఒక్కో సభ్యుడు ఉన్నారు. హాంకాంగ్ నుంచి వీరు ప్రత్యేక విమానంలో నేపాల్ మీద నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఈ బృందం వ్యాపార విస్తరణలో భాగంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకే జాక్ మా పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ వాణిజ్య ఛాంబర్‌ల అధికారులతో వీరు సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే నిర్దిష్ట వ్యాపార ఒప్పందాలు జరిగినట్లు ఎవరూ ప్రకటించలేదు. జాక్ మా పర్యటన ఖచ్చితంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని అహ్సాన్ ట్వీట్ చేశారు. ఈ పర్యటన చైనా రాయబార కార్యాలయానికి కూడా తెలియదని ఆయన అన్నారు. మరోవైపు యాంట్ గ్రూప్, అలీబాబాయే కాకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర రంగాలకూ విస్తరించే యోచనలో జాక్ మా ఉన్నారని తెలుస్తోంది. దానికి సంబంధించిన ప్రణాళికలను ఆయన జపాన్‌లో రూపొందించినట్లు అంతర్జాతీయ వార్త సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే రంగాల్లోకి విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం.
వ్యాపారాలపై చైనా విధిస్తున్న నియంత్రణలపై జాక్ మా బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆయనకు కష్టకాలం మొదలైంది. జిన్‌పింగ్ నేతృత్వంలోని సర్కార్ ఆయన సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. యాంట్ గ్రూప్ ఐపీఓని అడ్డుకుంది. ఆ తర్వాత నుంచే చైనాలో ప్రైవేట్ టెక్ కంపెనీలపై అక్కడి ప్రభుత్వం విరుచుకుపడడం ప్రారంభించింది. తర్వాత జాక్‌మా పెద్దగా బయట కనిపించడం లేదు. వీలైనంత వరకు ప్రజాకార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఎక్కడా ఆయన గురించి చిన్న వార్త కూడా బయటకు రావడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com