Delhi Blast: ఫరీదాబాద్ జైషే మాడ్యూల్ కేసు విచారణలో కీలక పురోగతి

ఫరీదాబాద్‌లో ఇటీవల వెలుగుచూసి జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద మాడ్యూల్ కేసు విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మాడ్యూల్‌లో డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షహీన్, డాక్టర్ అదీల్ వంటి ఉన్నత విద్యావంతులు భాగస్వాములుగా ఉన్నారని, వీరు అత్యంత పకడ్బందీగా ఆయుధాలు సేకరించి, పేలుడు పదార్థాలు తయారు చేసే నెట్‌వర్క్‌ను నడిపినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
విచారణలో భాగంగా నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ రూ.5 లక్షలు పెట్టి ఒక రష్యన్ అసాల్ట్ రైఫిల్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ ఆయుధాన్ని సహ నిందితురాలైన డాక్టర్ షహీన్‌కు సంబంధించిన వ్యక్తి ద్వారా సమకూర్చుకున్నాడు. అనంతరం దాన్ని డాక్టర్ అదీల్ లాకర్‌లో దాచిపెట్టగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదికాకుండా, మరో రష్యన్ ఏకే క్రింకోవ్ రైఫిల్, ఒక చైనీస్ స్టార్ పిస్టల్, బెరెట్టా పిస్టల్‌తో పాటు సుమారు 2,900 కేజీల పేలుడు పదార్థాలను కూడా అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. ఆమె రైఫిళ్లు, పేలుడు రసాయనాలను నిల్వ చేసేందుకు ఒక డీప్ ఫ్రీజర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మాడ్యూల్ కోసం మొత్తం రూ.26 లక్షల నిధులు సేకరించగా, అందులో ఎక్కువ భాగం షహీన్ ద్వారానే సమకూరినట్లు తేలింది. పుల్వామా దాడి సూత్రధారి, జైషే చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడైన ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో షహీన్‌కు సంబంధాలు ఉండవచ్చని ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.
తుర్కియేలోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఉమర్ ఆన్‌లైన్‌లో బాంబుల తయారీపై శిక్షణ తీసుకున్నాడు. రసాయనాలను నుహ్ నుంచి, ఎలక్ట్రానిక్ పరికరాలను ఢిల్లీ, ఫరీదాబాద్‌ల నుంచి సేకరించాడు. డబ్బు విషయంలో నిందితుల మధ్య అల్-ఫలా యూనివర్సిటీలో గొడవ జరిగినట్లు, ఆ తర్వాత ఉమర్ పేలుడు పదార్థాలతో నింపిన తన కారును ముజమ్మిల్‌కు అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

