Japan: జపాన్‌పై విరుచుకుపడ్డ సునామీ అలలు..

Japan: జపాన్‌పై విరుచుకుపడ్డ సునామీ అలలు..
సముద్రపు నీరు రోడ్లపైకి , ఇళ్లలోకి..

వరుస భూకంపాల ధాటికి జపాన్‌ తీర ప్రాంతాల్లోని కొన్ని పట్టణాల్లో సునామీ అలలు ఎగసిపడ్డాయి. ఇళ్లు, దుకాణాల్లోకి సముద్రపు నీరు చేరింది. వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ధాటికి పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాల్లో సునామీ అలలు భీభత్సం సృష్టించాయి. భారీ ఎత్తున అలలు ఎగసిపడి తీర ప్రాంతంలో అపార నష్టాన్ని కలిగించాయి. అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. వాహనాలు, బోట్లు దెబ్బతిన్నాయి. తీర ప్రాంతంలో నివసిస్తున్న వారు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.


నొటో పట్టణంలో సునామీ అలల కారణంగా భారీ నష్టం జరిగింది. సముద్రం నీరు తీర ప్రాంతా‌ల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లోకి దూసుకువచ్చింది. చాలా మంది ఆ సమయంలో ఇళ్లలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. తాము పని నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి సునామీ అలల కారణంగా తమ ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నొటో వాసులు గుర్తించారు. ఇళ్లు ధ్వంసమైన కారణంగా కొంతమంది పని ప్రదేశాల్లోనే ఆశ్రయం పొందారు. అనేక ప్రాంతాల్లో నీరు, విద్యుత్‌ సరఫరా, సెల్‌ఫోన్‌ సేవలు నిలిచిపోయాయి. ధ్వంసమైన ఇళ్లను చూసి బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని వాపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతం మొత్తాన్నీ అధికారులు ఖాళీ చేయించారు. పర్యాటకులను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడం, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటం వంటి ఘటనలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్చి 2011లో జపాన్‌లో ఏర్పడిన భారీ భూకంపం.. సునామీ అణు ప్లాంట్ వైఫల్యానికి కారణమైంది. అయితే అప్పటి నుంచి ఆ దేశంలో తీవ్ర భూకంపం, హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రభావిత ప్రాంతంలోని అణు కర్మాగారాలు సోమవారం ఎలాంటి ప్రభావానికి గురికాలేదని ప్రభుత్వ ప్రతినిధి హయాషి విలేకరులకు తెలిపారు. ఈ ప్రాంతంలోని మానిటరింగ్ పోస్టుల వద్ద రేడియేషన్ స్థాయిలు పెరగలేదని అణు నియంత్రకారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story