Wolf dress : తోడేలు మనిషి

Wolf dress : తోడేలు మనిషి
తోడేలుగా కనిపించేందుకు రూ.20 లక్షల సూట్

పిచ్చి పలు రకాలు అంటారు.. అలాంటి పిచ్చిలో ఇది 482వ రకం అనుకుందాం.. ఇంతకీ ఈ జపాన్ వ్యక్తికి ఉన్న పిచ్చి ఏంటో అంటే తెలుసా.. తోడేలు గా మారడం. అతను ఎలాగూ తోడేలుగా మారలేడు కాబట్టి అలాంటి డ్రెస్ కుట్టించుకున్నాడు. . ఆ సరదా తీర్చుకోవడానికి అతను అక్షరాలా రూ.20 లక్షలు ఖర్చు చేశాడు.

ఒక్కొక్కరికీ ఒక్కో కల. జపాన్ కు చెందిన ఈ టోరు ఉయిడాఅనే 32 ఏళ్ల ఇంజనీర్ కు తోడేలులా కనిపించాలన్నది చిన్ననాటి కల. ఈ కల నెరవేర్చుకునేందుకు అతను బోలెడంత డబ్బు సంపాదించి పెట్టుకున్నాడు. ఇప్పుడు అందుకోసం రూ.20 లక్షలు ఖర్చు పెట్టాడు. అచ్చం తోడేలును పోలి ఉండేలా, వేసుకోవడానికి చాలా సదుపాయంగా ఉండేలా ప్రత్యేకంగా ఓ సూట్ తయారు చేయించుకున్నాడు. ఆ సూట్ ధరిస్తే ఎవరైనా సరే అచ్చు తోడేలులానే కనిపిస్తారు. జెప్పెట్ వర్క్ షాప్ అనే మోడలింగ్ సంస్థ ఈ తోడేలు సూట్ ను రూపొందించింది.

నిజానికి జెప్పెట్ వర్క్ షాప్ సినిమాలు, టీవీ సిరీస్ లకు అవసరమైన కాస్ట్యూమ్స్ ను తయారు చేస్తుంటుంది. ఈ సంస్థను సంప్రదించిన టోరు ఉయిడా తనకు తోడేలు కాస్ట్యూమ్ కావాలని కోరాడు. అతడి నుంచి ఆర్డర్ స్వీకరించిన జెప్పెట్ సంస్థ ఇందుకోసం ప్రతేకంగా పనిచేసింది. సంస్థలోని నలుగురు ఉద్యోగులు పగలూ, రాత్రి శ్రమించి, 7 వారాల వ్యవధిలో ఆ సూట్ తయారు చేశారు.

అయితే, అంత ఖర్చు పెట్టి తయారు చేయించుకున్న తోడేలు సూట్ ను కేవలం ఇంట్లోనే ధరిస్తానని టోరు ఉయిడా చెబుతున్నాడు. ఆ సూట్ ను బయటికి వెళ్లేటప్పుడు ధరిస్తే అసౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఈ తోడేలు సూట్ ధరించి రిలాక్స్ అవుతానని, ఈ సూట్ ధరిస్తే తన శరీరమే కాదు మనసు కూడా తోడేలుగా మారిపోతుందని, తానొక మనిషిని అనిపించదని బాధలన్నీ మర్చిపోతానని వెల్లడించాడు. అంతేకాదు, ఆ తోడేలు సూట్ ధరిస్తే తానెంతో శక్తిమంతుడ్ని అనే భావన కలుగుతుందని చెప్పాడు.


ఇదే కంపెనీ అంతకు ముందు ఓ వ్యక్తికి డాగ్ సూట్ తయారు చేసింది. ఆ వ్యక్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ ఆ వార్త కూడా వైరల్ అయింది. డాగ్ సూట్ వేసుకున్న వ్యక్తి రోడ్డుపైన నడిచిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ డాగ్ సూట్‌ ఖరీదు రూ.12 లక్షలు.

Tags

Read MoreRead Less
Next Story