Japan Volcano Eruption: జపాన్‌లో పేలిన అగ్నిపర్వతం..

Japan Volcano Eruption: జపాన్‌లో పేలిన అగ్నిపర్వతం..
X
ఆకాశంలో 4.4 కిలోమీటర్లకు ఎగిసిన బూడిద!

జపాన్‌లో అగ్నిపర్వతం పేలింది. పశ్చిమ జపాన్ ద్వీపం క్యుషులోని సకురాజిమా అగ్నిపర్వతం వద్ద ఆదివారం తెల్లవారుజామున అనేక భారీ పేలుళ్లు సంభవించాయి. వాతావరణ సంస్థ (JMA) ప్రకారం.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1 గంటలకు సంభవించింది. ఆ తరువాత ఉదయం 2:30, ఉదయం 8:50 గంటలకు మరో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ మూడు పేలుళ్లు చాలా శక్తివంతమైనవని, వీటి కారణంగా లావా, బూడిద ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసాయని వెల్లడించింది. గత 13 నెలల్లో బూడిద ఇంత ఎత్తుకు చేరుకోవడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.

కగోషిమా నగరం దాని పరిసర ప్రాంతాలపై దట్టమైన బూడిద పొర పేరుకుపోవడంతో అక్కడ దృశ్యమానత గణనీయంగా తగ్గింది. విమానాశ్రయంలో కూడా పరిస్థితి మరింత దిగజారింది. భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు 30 విమానాలు రద్దు చేశారు. ప్రయాణీకులు చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. నగర పరిపాలన అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సకురాజిమా అగ్నిపర్వతం వద్ద చిన్న చిన్న విస్ఫోటనాలు సర్వసాధారణం, కానీ ఈసారి పేలుడు దాటి ఎక్కువగా ఉంది, ఫలితంగా బూడిద, వేడి వాయువులు చాలా ఎక్కువగా బయటకు వచ్చాయి అని వెల్లడించాయి. శాస్త్రవేత్తలు రాడార్, ఉపగ్రహాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఈ అగ్నిపర్వతం జపాన్‌లో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. ఇది 2019 లో పేలిన సందర్భంలో దాదాపు 5.5 కి.మీ ఎత్తు వరకు బూడిదను వెదజల్లింది. ఇప్పుడు కూడా ఇక్కడి అధికాలు అత్యంత అప్రమత్తంగా సహాయ, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పెద్ద నష్టం లేదా ప్రాణనష్టం సంభవించకపోవడం ఉపశమనం కలిగించే విషయంగా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విస్పోటనం ప్రకోపం నగరంలో పారిశుధ్యం, రవాణాపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈ తాజా అగ్నిపర్వత విస్ఫోటనం జపాన్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉందని, ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు నిరంతరం ఆందోళన కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Tags

Next Story