JD Vance: గుడ్ న్యూస్ చెప్పిన జేడీ వాన్స్ దంపతులు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా ఈ దంపతులపై ఎన్నో పుకార్లు వచ్చాయి. కొద్దిరోజుల పాటు అంతర్జాతీయంగా వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా ఈ దంపతుల నుంచి మంచి శుభవార్త వచ్చింది.
జేడీ వాన్స్ (41), ఉషా వాన్స్ (40) దంపతులకు త్వరలోనే నాల్గో బిడ్డ రానుంది. ఈ మేరకు అమెరికా సెకండ్ లేడీ ఉష వెల్లడించారు. నాల్గో బిడ్డ వార్తను పంచుకోవడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని.. రాబోయే బిడ్డ మరో ముగ్గురు చిన్నారులైన ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో చేరబోతున్నట్లు దంపతులిద్దరూ ప్రకటించారు.
ప్రస్తుతం ఉష, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని.. జులై చివరిలో కొడుకును ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లో పేర్కొన్నారు. అమెరికన్లు ఎక్కువ మంది పిల్లలను కనాలని జేడీ వాన్స్ అనేక సంవత్సరాలుగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన కుటుంబం నుంచే మరొక బిడ్డ రావడం ఆసక్తి రేపుతోంది.
2021లో ఒహియోలో యూఎస్ సెనేట్‌కు పోటీ చేయడం ద్వారా జేడీ వాన్స్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అమెరికాలో జనన రేట్లు తగ్గుతున్నాయని మొదటి నుంచి తన స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. 2025 మార్చిలో ‘ఫర్ లైఫ్’ ప్రసంగంలో ‘‘నాకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మరింత మంది పిల్లలు కావాలి.’’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ తన బాధ్యతను నెరవేరుస్తున్నారు.
ఇదిలా ఉంటే గతేడాది జేడీ వాన్స్ దంపతులు విడిపోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. ఓ కార్యక్రమంలో ఎరికా కిర్క్‌ను జేడీ వాన్స్ కౌగిలించుకోవడం.. ఉష హిందూత్వం గురించి జేడీ వాన్స్ మాట్లాడడంతో విడిపోతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆ దంపతులు నాల్గో బిడ్డను ఆశించడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
