JD Vance: చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం, సోషల్ మీడియాలో వీడియో వైరల్

JD Vance: చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం, సోషల్ మీడియాలో వీడియో వైరల్
X
తొలుత బృందాల మధ్య పరోక్ష చర్చలు, రాత్రికి ఇరు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చలు

అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యింది. వాన్స్‌కు అక్కడ ఇచ్చిన స్వాగతం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఉన్నతాధికారులు స్వాగతం పలకాల్సిన ప్రోటోకాల్‌కు భిన్నంగా, ఒక చిన్నారి చేతుల మీదుగా బొకే అందించడం ప్రత్యేకంగా కనిపించింది. వాన్స్ కిందకు వంగి ఆ బొకే స్వీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా అక్కడే ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. తొలుత పరోక్ష చర్చలు, అనంతరం ప్రత్యక్ష చర్చలు జరగనున్నట్లు సమాచారం. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఇరు బృందాలు విడివిడిగా భేటీ కానున్నాయి.

ఇక మరోవైపు, ఇరాన్ విడుదల చేసిన ‘మినాబ్-168’ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. చిన్నారుల మరణాలను నిరసిస్తూ ఖాళీ విమానంలో బ్యాగులు, రక్తంతో తడిసిన దుస్తులు ప్రదర్శించడం భావోద్వేగాలను రేకెత్తించింది. ఇదే సమయంలో వాన్స్‌కు చిన్నారి ద్వారా స్వాగతం ఇవ్వడం యాదృచ్ఛికమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్రిక్త పరిస్థితుల్లో జరుగుతున్న ఈ చర్చలు శాంతి దిశగా కీలకంగా మారనున్నాయి. ప్రపంచ దేశాలు వీటి ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Tags

Next Story