Jeff Bezos: వెనిస్‌ వేదికగా బెజోస్‌ వివాహం..

Jeff Bezos:  వెనిస్‌ వేదికగా బెజోస్‌ వివాహం..
X
2023లో ఎంగేజ్మెంట్‌, ఈ వేసవిలో వివాహం

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వీరి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. ఈ వేసవిలో ఈ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇటలీ లోని వెనిస్‌ నగరం వీరి వివాహానికి వేదిక కానుంది.

ఇటలీ తీరంలో బెజోస్‌కు ఉన్న 500మిలియన్‌ డాలర్ల విలాస నౌక (సూపర్ యాచ్ట్)లో జూన్‌లో వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ జంట అధికారికంగా తమ అతిథులకు వివాహ ఆహ్వానాలను కూడా పంపడం ప్రారంభించినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. జూన్‌లో వీరి వివాహం ఉన్నట్లు తెలిసింది. అయితే, ఖచ్చితమైన తేదీ మాత్రం తెలియరాలేదు.

మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 54 ఏళ్ల శాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్‌ బెజోస్‌ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్‌ తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్‌ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో 2023లో వీరు ఎంగేజ్మెంట్‌ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్‌ సందర్భంగా బెజోన్‌ తనకు కాబోయే భార్యకు 2.5 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.21కోట్లు) విలువ చేసే రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు ప్రియురాలి కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అమెరికా ఫ్లోరిడా లోని ‘ఇండియన్‌ క్రీక్‌’ ఐలాండ్‌లో 68 మిలియన్‌ డాలర్ల (రూ.560 కోట్లు) త్రీ బెడ్‌ రూమ్‌ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Tags

Next Story