Jimmy Lai: హాంకాంగ్ మీడియా కింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతుగా నిలిచిన మీడియా దిగ్గజం, 'యాపిల్ డైలీ' పత్రిక వ్యవస్థాపకుడు జిమ్మీ లాయ్‌కు స్థానిక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 78 ఏళ్ల జిమ్మీ లాయ్‌పై జాతీయ భద్రతా చట్టం కింద ఈ తీర్పు వెలువడింది. హాంకాంగ్‌లో ఈ చట్టం కింద విధించిన అత్యంత కఠినమైన శిక్ష ఇదే కావడం గమనార్హం.
విదేశీ శక్తులతో కుమ్మక్కై చైనా, హాంకాంగ్‌లపై ఆంక్షలు విధించేలా కుట్ర పన్నారని, దేశద్రోహపూరిత కథనాలను ప్రచురించారని జిమ్మీ లాయ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2019 నాటి ప్రజాస్వామ్య అనుకూల నిరసనల తర్వాత ఈ కుట్రలకు జిమ్మీ లాయ్ "మాస్టర్‌మైండ్"గా వ్యవహరించారని కోర్టు పేర్కొంది.
2020లో బీజింగ్ ప్రభుత్వం హాంకాంగ్‌లో వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం కిందనే జిమ్మీ లాయ్‌ను అరెస్టు చేసి విచారించారు. మరో కేసులో గత రెండేళ్ల నుంచి ఆయన జైలు శిక్ష అనుభవిస్తుండడంతో, ఈ తాజా తీర్పుతో ఆయన మరో 18 ఏళ్లు జైల్లోనే గడపాల్సి ఉంటుందని జడ్జి పేర్కొన్నారు.
ఈ తీర్పుపై జిమ్మీ లాయ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత కఠోరమైన, క్రూరమైన శిక్ష అని ఆయన కుమారుడు సెబాస్టియన్ అన్నారు. "ఈ వయసులో ఈ శిక్ష ఆయన ప్రాణాలకు ముప్పు" అని పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని, ఈ శిక్షతో ఆయన జైల్లోనే అమరుడవుతారని కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
