Burkina Faso attack: బుర్కినా ఫాసోలో నరమేధం.. 100 మంది బలి

పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దేశ ఉత్తర ప్రాంతంలో అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వల్-ముస్లిమీన్ (జేఎన్ఐఎం) జరిపిన భీకర దాడిలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో మరణించిన వారిలో అత్యధికులు సైనికులే కావడం గమనార్హం.
ఉత్తర బుర్కినా ఫాసోలోని కీలకమైన జిబో పట్టణంతో పాటు అక్కడి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. బుర్కినా ఫాసోలో తీవ్రంగా ప్రభావితమైన వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్న ఓ సహాయక కార్యకర్త ఈ విషయాన్ని తెలిపారు. ఈ దాడిలో తన తండ్రి కూడా మరణించినట్టు ఆ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీకార చర్యలకు భయపడి వీరిద్దరూ తమ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. సాహెల్ ప్రాంతంలో చురుకుగా వ్యవహరిస్తున్న జేఎన్ఐఎం.. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించుకుంది.
బుర్కినా ఫాసో వైమానిక దళాన్ని పక్కదారి పట్టించేందుకు జేఎన్ఐఎం ఉగ్రవాదులు ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాలపై దాడులు చేశారని సదరు సహాయక కార్యకర్త వివరించారు. ప్రధాన దాడి జిబో పట్టణంలో జరిగిందని, తొలుత పట్టణంలోని అన్ని ప్రవేశ మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు ఆ తర్వాత సైనిక శిబిరాలపై, ముఖ్యంగా స్పెషల్ యాంటీ-టెర్రరిస్ట్ యూనిట్ క్యాంప్‌పై విరుచుకుపడ్డారని ఆయన తెలిపారు.
గతంలో జిబోపై జరిగిన దాడులను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ, ఈసారి మాత్రం ఉగ్రవాదులు ఎలాంటి వైమానిక ప్రతిఘటన లేకుండా గంటల తరబడి ఆ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించారని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలను అధ్యయనం చేసిన స్వతంత్ర విశ్లేషకుడు చార్లీ వెర్బ్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com