1972లో ఆసుపత్రి గది నుంచీ సెనేటర్‌గా జో బైడెన్ ప్రమాణం

1972లో ఆసుపత్రి గది నుంచీ సెనేటర్‌గా జో బైడెన్ ప్రమాణం
ఆసుపత్రి గది నుంచీ డెమొక్రటిక్ పార్టీ సెనేటర్‌గా బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంఘటన అప్పట్లో అందరినీ కలచివేసింది.

కష్టాల కడలి నుంచి శ్వేతసౌధాన్ని అధిరోహించిన జో బైడెన్ పూర్తి పేరు.. జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్. 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌లో జన్మించారు. ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ కాథలిక్ కుటుంబంలో పుట్టారు. మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్‌లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి భార్య నెలియాను వివాహమాడిన తరువాత విల్మింగ్టన్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

జో బైడెన్ 1972లో సెనేటర్ ఎన్నికల్లో మొదటిసారి గెలిచి, పదవిని స్వీకరించడానికి సిద్ధమవుతుండగా, ఓ కారు ప్రమాదంలో ఆయన భార్య, కూతురు నెయోమి మరణించారు. కుమారులు బౌ, హంటర్‌లకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ తన బిడ్డలకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి గది నుంచీ డెమొక్రటిక్ పార్టీ సెనేటర్‌గా బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంఘటన అప్పట్లో అందరినీ కలచివేసింది.

బైడెన్ సెనెటర్‌ పదవి చేపట్టిన తరువాత మొదటి 14 సంవత్సరాల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశారు. భార్య, కూతురి మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో తన సొంతిల్లు ఉన్న డెలవేర్ నుంచి వాషింగ్టన్‌కు రోజూ వచ్చి వెళ్తుండేవారు. ఆ తర్వాత స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్‌ను వివాహమాడారు బైడెన్. వీరి కుమార్తె ఆష్లే బైడెన్ ఒక ఫ్యాషన్ డిజైనర్, యాక్టివిస్ట్ కూడా. ఆ తరువాత బైడెన్ జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగారు.

Tags

Read MoreRead Less
Next Story