G-7 Summit: ఇటలీలో బైడెన్ వింత ప్రవర్తన!

అమెరికా అధ్యక్షుడు బైడెన్...మరోసారి తన మతిమరుపు, వృద్ధాప్య సమస్యలతో వార్తల్లో నిలిచారు. గతంలో పలుమార్లు వివిధ కార్యక్రమాల్లో ఈ విషయం బయటపడింది. తాజాగా జీ-7దేశాల సదస్సుకు హాజరైన సభ్య దేశాధినేతల గ్రూప్ ఫొటో సందర్భంగా బైడెన్ మతిమరుపు మరోసారి బయటపడింది.
ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఆ దేశ అధ్యక్షుడి బైడెన్ వ్యవహారశైలి, గందరగోళానికి గురైన పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇటలీలో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతలు గ్రూప్ ఫొటోకు సిద్ధమయ్యారు. వారంతా ఒకవైపు ఉండగా ...బైడెన్ మాత్రం మరోవైపు వెళ్లారు. అలాగే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. ఆయన వెళ్లినవైపు ఎవరూలేరు. ఎంతసేపటికీ బైడెన్ గ్రూప్ ఫొటో దిగేందుకు రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకురావాల్సి వచ్చింది.
ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం వైట్‌హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కూడా బైడెన్ ఇలాగే ప్రవర్తించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్‌తోపాటు ఆమె భర్తసహా ఆయన చుట్టూ ఉన్న వారంతా సంగీతానికి తగ్గట్టుగా కాలు కదుపుతుంటే బైడెన్ మాత్రం కాసేపు నిస్తేజంగా నిల్చుండిపోయారు.
81 ఏళ్ల బైడెన్‌ను వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఫలితంగా ఆయనలో జ్ఞాపక శక్తి లోపాలను గుర్తించినట్లు గతంలో ఒక నివేదిక విడుదలైంది. బైడెన్ జ్ఞాపకశక్తి చాలా తక్కువ ఉన్నట్లు పేర్కొంది. ఆయన తన జీవితంలోని కీలక ఘటనలను గుర్తు తెచ్చుకోలేకపోతున్నారని తెలిపింది. బైడెన్‌కు తన కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయంతోపాటు ఆయన ఉపాధ్యక్షుడిగా పని చేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇలాంటి దృశ్యాలు రిపబ్లికన్ పార్టీకి అస్త్రాలుగా మారే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com