భారత్‌లో బైడెన్‌కు బంధువులు?

అమెరికా కాబోయే అధ్యక్షుడు బైడెన్ కు భారత్ తో బంధం.. ముంబైతో సంబంధాలు ఉన్నాయంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికైన వేళ.. యావత్ ప్రపంచం ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుతెచ్చుకుంటోంది. ఇప్పటికే అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారతీయ అమెరికన్ కమలా హారిస్‌కు తమిళనాడు మూలాలుండడంతో ఆ రాష్ట్రంలో సందడి నెలకొంది. ఇదే సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కూ భారత్‌తో కుటుంబ అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఐదుగురు బైడెన్‌లు ఉన్నారనే వార్త మరోసారి తెరపైకి వచ్చింది.
ముంబైలో ఐదుగురు బైడెన్‌లు ఉన్నారనే విషయాన్ని జో బైడెన్ గతంలో చెప్పారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ 2015లో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాషింగ్టన్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 1972లో తాను అమెరికా సెనేటర్‌గా తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబై నుంచి బైడెన్ పేరుతో ఒక లేఖ వచ్చిందని గుర్తు చేశారు. అయితే, దాన్ని తాను పట్టించుకోలేదని తెలిపారు. 2013లో ఉపాధ్యక్షుడి హోదాలో ముంబైలో పర్యటించానని, అప్పుడు తన వారసుల కోసం వాకబు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు. ఆరు తరాల క్రితం తన ముత్తాత ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ముంబైలో పని చేశారని గుర్తు చేసుకున్నారు. భారత్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారని తెలిపారు. బహుశా వారి వారసులే తనకు లేఖ రాశారని పేర్కొన్నారు. బైడెన్ వారసులు ఎవరైనా ఉంటే తనకు సమాచారం అందించాలని బైడెన్ నాడు కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com