అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం

అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ట్రంప్ శకం ముగిసి జో బైడెన్ నవశకం ఆరంభమైంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేశారు. క్యాపిటల్‌లో ప్రతిసారి వేలాది మంది సమక్షంలో ఘనంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం.. ఈసారి కరోనా, ఇతర భద్రతా కారణాల దృష్ట్యా నిరాడంబరంగా సాగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్.. 78ఏళ్ల బైడెన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127ఏళ్ల బైబిల్‌పై ప్రమాణం చేశారు బైడెన్. ఆ సమయంలో బైబిల్‌ను ఆయన భార్య జిల్ బైడెన్ పట్టుకున్నారు. అమెరికన్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ వేడుకను టీవీ ఛానళ్లతో పాటు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ వేడుకకు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరి క్లింటన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా హాజరయ్యారు.అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీతో పాటు పలువురు చట్టసభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడుగా సేవలందించిన మైక్ పెన్స్ కూడా బైడెన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. అయితే... సంప్రదాయాలకు విరుద్ధంగా ట్రంప్ - బైడెన్ ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. గత 150 ఏళ్లలో అంటే ఆండ్రూ జాన్సన్ తరువాత ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రమాణ స్వీకారోత్సవాన్ని బాయ్‌కాట్ చేయడం ఇదే ప్రథమం.
అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అందుకు ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఇటీవల పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆయన.. ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందని పరోక్షంగా ట్రంప్ పాలనను దుయ్యబట్టారు. అదే సమయంలో తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానంటూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
బైడెన్ కంటే ముందుగానే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ప్రమాణం చేశారు. భారతీయ మూలాలున్న కమల ఇక మీదట శ్వేతసౌధంలో అత్యంత కీలకపాత్ర పోషించనున్నారు. ఓ రకంగా ఆమె అన్ని వ్యవహారాల్లో కేంద్ర బిందువు కానున్నారు.
ప్రమాణస్వీకారం కోసం క్యాపిటల్‌కు వచ్చే ముందు.. కుంటుంబసభ్యుల సమేతంగా వాషింగ్టన్‌లోని చారిత్రక చర్చిని సందర్శించారు బైడెన్-కమల. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధాని మోద శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికా మైత్రిని దృఢపరిచేందుకు బైడెన్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు . అటు ప్రపంచ దేశాల నేతలు పలువురు నూతన అధ్యక్షుడు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com