Kim Jong Un: తండ్రితో కలిసి పవిత్ర సమాధి వద్ద జు-యే నివాళులు.. ఉత్తర కొరియా వారసురాలు తనేనా?

తండ్రి కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి కుమ్సుసాన్ ప్యాలెస్‌ను సందర్శించిన జు-యే

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జు-యేను మరోసారి ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేశారు. 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, కిమ్ తన తండ్రి (కిమ్ జోంగ్ ఇల్), తాత (కిమ్ ఇల్ సంగ్) భౌతిక కాయాలను భద్రపరిచిన పవిత్రమైన 'కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్'ను కుమార్తెతో కలిసి సందర్శించారు. జు-యే ఈ ప్యాలెస్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా (కేసీఎన్ఏ) విడుదల చేసిన చిత్రాలలో కిమ్ కుటుంబం ప్రధాన వరుసలో నిలబడి నివాళులర్పించింది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య రి సోల్ జు మధ్యలో కుమార్తె జు-యే నిలబడి ఉన్నారు. సాధారణంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన వారు ఉండే మధ్య స్థానాన్ని తన కుమార్తెకు కేటాయించడం ద్వారా కిమ్ ఆమెను తన వారసురాలిగా సూచనప్రాయంగా ప్రకటిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గురువారం రాత్రి ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన నూతన సంవత్సర ప్రదర్శనలో కూడా జు-యే సందడి చేశారు. తన తండ్రి ధరించిన శైలిలోనే నల్లటి లెదర్ కోటు ధరించి ఆయన పక్కనే కూర్చున్నారు. కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత కిమ్ బుగ్గపై ముద్దుపెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు. ఈ వేడుకల్లో ఆమె పిల్లలను హత్తుకోవడం, ప్రజలకు అభివాదం చేయడం వంటి దృశ్యాలు ఆమెకు పెరుగుతున్న ప్రాధాన్యం చాటుతున్నాయి.

ఈ పరిణామాలపై దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. కిమ్ కుమార్తె పవిత్ర సమాధిని సందర్శించడం ఇదే తొలిసారని ధ్రువీకరించింది. ఆమె కార్యకలాపాలను తాము నిశితంగా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు. 2022లో మొదటిసారిగా బయట ప్రపంచానికి కనిపించిన జు-యే, అప్పటి నుంచి తన తండ్రితో కలిసి మిస్సైల్ ప్రయోగాలు, సైనిక విన్యాసాలు మరియు కీలక వేడుకల్లో పాల్గొంటూనే ఉన్నారు.

Tags

Next Story