Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి ఇంకో ఝలక్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు నుంచి మరో ఝలక్. చాలా మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ నిలిపివేశారు. అసలు పర్సనల్ మేనేజ్‌మెంట్ ఆఫీసుకి అటువంటి అధికారాలు ఉండవని చెప్పారు. ట్రంప్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు కోర్టుకు వెళ్లడంతో వారికి అనుకూలంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు ఇచ్చారు. అమెరికాలోని కొన్ని ఏజెన్సీల్లో చట్టవ్యతిరేకంగా ప్రొబేషనరీ సిబ్బందిని తీసేస్తున్నారని కార్మికులు చెప్పారు.
వాదనలు విన్న జడ్జి.. పర్సనల్ మేనేజ్‌మెంట్ ఆఫీసుకి తన సొంత ఉద్యోగులను తీసేసే హక్కు ఉంది కానీ, ఇతర శాఖల్లో ఉద్యోగాలు తీసేసే హక్కు లేదని అన్నారు. ఫెడరల్ ఏజెన్సీలే వారి శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వడం, తీసేయడం వంటి కార్యకలాపాలు జరుపుకునేలా వాటికి అధికారం ఉందని చెప్పారు. ఉద్యోగుల తీసివేతలపై గవర్నమెంట్ నిర్ణయం చట్టవ్యతిరేకమని తెలిపారు.
కాగా, ఫెడరల్ ఏజెన్సీల్లో సుమారు 2 లక్షల మంది సిబ్బంది ఉండగా, చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ట్రంప్ ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు డోజ్ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి చీఫ్‌గా ఎలాన్ మస్క్ ఉన్నారు. గవర్నమెంట్ వ్యవస్థలో వృథా వ్యయాన్ని కట్టడి చేసేందుకు కూడా ఇది పనిచేస్తుంది.
ఫెడరల్ ఏజెన్సీల్లో చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేయాలని డోజ్ నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ తీసుకున్న పలు నిర్ణయాలకు అప్పట్లో కోర్టులు అడ్డుకట్ట వేశాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com