Canada PM Justin Trudeau:ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ట్రూడో..

Canada PM Justin Trudeau:ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ట్రూడో..
X
సొంత పార్టీ, దేశ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత..

కెనడా రాజకీయాల్లో కుదుపు చోటు చేసుకుంది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. తన నాయకత్వంపై లిబరల్‌ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అసంతృప్తి పెరిగిపోతుండటంతో అర్ధంతరంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రూడో క్యాబినెట్‌ నుంచి ఆర్థిక మంత్రి వైదొలగడంతో ఆయన ప్రభుత్వంలో సంక్షోభం పతకా స్థాయికి చేరుకుంది. లిబరల్‌ పార్టీ కొత్త నాయకుడ్ని ఎన్నుకునే వరకూ ప్రధానిగా కొనసాగుతానని ట్రూడో స్పష్టం చేశారు.

అంతర్గత సమస్యల వల్ల తదుపరి ఎన్నికలు జరిగే వరకూ నాయకుడిగా కొనసాగలేనని జస్టిన్‌ ట్రూడో చెప్పారు. పోరాటంలో వెనక్కు తగ్గడం అంత తేలికేం కాదన్నారు. ప్రత్యేకించి కెనడా పౌరులు, పార్టీ, దేశానికి చాలా ముఖ్యం అన్నారు. ప్రజాస్వామ్యంలో కెనడియన్ల ప్రయోజనాల పరిరక్షణకు తాను ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పారు.

ప్రధానిగా జస్టిన్‌ ట్రూడో రాజీనామాతో ఈ నెల 27న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాలు మార్చి 24 వరకూ వాయిదా పడ్డాయి. ఈ మూడు నెలల కాలంలో తదుపరి లిబరల్ పార్టీ నాయకుడ్ని ఎన్నుకోవడానికి సమయం సరిపోతుందని భావిస్తున్నారు. దేశంలోని మూడు ప్రధాన ప్రతిపక్షాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్ధం కావడంతో ట్రూడో రాజీనామాకు ప్రాధాన్యం ఏర్పడింది.

2015లో ట్రూడో అధికారంలోకి వచ్చారు. ఒక దశాబ్ధంగా పాలనలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని అధికారం నుంచి దించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లో అప్రూవల్ రేటింగ్స్‌లో వెనకబడి ఉన్నారు.

మరోవైపు అమెరికా, భారత్ వంటి ప్రధాన దేశాలతో గొడవలు కూడా ట్రూడోని దెబ్బతీశాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి వేదిక చేయడంతో పాటు గ్యాంగ్ స్టర్లకు అడ్డగా మార్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కెనడా గత కొంత కాలంగా ‘‘హౌసింగ్ సంక్షోభం’’ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రూడోపై చాలా వ్యతిరేఖత వచ్చింది. మందగించిన వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్నజీడీపీ కూడా కారణాలుగా ఉన్నాయి.

Tags

Next Story