Afghanistan Pakistan Conflict: పాక్ - ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తత

పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చి, పెను విషాదాన్ని నింపుతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ భీకర పోరు కారణంగా సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలు చెల్లాచెదురై రోడ్డున పడ్డాయి. గత గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇరు దేశాల సైనిక చర్యలతో మరింత దారుణంగా మారాయి.
ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లోని పలు ప్రాంతాల నుండి సుమారు 20,000 కుటుంబాలు ప్రాణభయంతో తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా, వందకు పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉండటం తీవ్రంగా కలచివేస్తోంది.
సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో మానవతా సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో, ఈ ప్రాంతాల్లో అత్యవసర ఆహార సరఫరా నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) హెచ్చరించింది.
పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిగా తాము దాడులు ప్రారంభించినట్లు ఆఫ్ఘన్ ప్రకటించగా, ఇస్లామాబాద్ సైతం వెనక్కి తగ్గకుండా కాబూల్, కాందహార్, వ్యూహాత్మక బాగ్రామ్ ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ముఖ్యంగా కునార్ ప్రాంతంలో క్షిపణి దాడులు, భారీ ఆయుధాల మోతతో ప్రజలు భీతావహ స్థితిలో కాలం గడుపుతున్నారు. సైనిక పరంగా కూడా ఇరు దేశాలకు భారీ నష్టం వాటిల్లింది. అఫ్ఘన్ తన వైపు 25 మంది సైనికులు మరణించారని చెబుతూనే, సుమారు 150 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
