US Presidential Debate: వాడీవేడిగా ట్రంప్-హారిస్ తొలి డిబేట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమొక్రాటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ ప్రారంభమైంది. ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరుగుతోన్న ఈ చర్చలో ఇరువురూ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. డిబేట్ ప్రారంభానికి ముందు ట్రంప్, హ్యారిస్‌లు కరచాలనం చేసుకుని.. వేదికపై తమను తాము పరిచయం చేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో ప్రత్యర్థులు కరచాలనం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగ్గ అంశం. ఆసక్తికరంగా ఇద్దరు నాయకులు కలుసుకోవడం కూడా ఇదే మొదటిసారి
చర్చ ఆరంభంలో దేశ ఆర్థికవ్యవస్థ గురించి హారిస్, ట్రంప్ మధ్య సంవాదం జరిగింది. ఆ తర్వాత గర్భవిచ్ఛిత్తి అంశంపై ఇరువురు వాడీవేడిగా వాదించారు. ‘‘మహిళల అభివృద్ధి ట్రంప్‌నకు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదు. ఇది మహిళలను అవమానించడమే..! ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారు. గర్భవిచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరు. సరైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం వారికి ఉంటుంది. అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులు’’ అని హారిస్ అన్నారు.
దీనికి ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఆమె అబద్ధం చెబుతున్నారు. గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి నేను అనుకూలం కాదు. ఆ బిల్లుపై సంతకం చేయబోను’’ అని చెప్పారు. అయితే, ఎనిమిది, తొమ్మిది నెలల్లో గర్భవిచ్ఛిత్తి ఎలా చేస్తారని, దానికి మాత్రం తాను అనుకూలం కాదని స్పష్టంచేశారు.
ఆర్దిక వ్యవస్థ, జీవన ప్రమాణంపై అడిగిన ప్రశ్నకు హ్యారిస్ సమాధానం ఇస్తూ.. తాను మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చానని, అధ్యక్షుిగా ఎన్నికైతే ఆ కుటుంబాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్న హ్యారిస్.. ఆయన ‘బిలియనీర్లు’ ‘పెద్ద సంస్థలకు’ పన్ను మినహాయింపులు ఇస్తారని విమర్శించారు. జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని గుర్తుచేశారు. ఒకానొక సమయంలో డొనాల్డ్ ట్రంప్ వద్ద సామాన్యుల కోసం ఎటువంటి ప్రణాళిక లేదని దుయ్యబట్టారు.
‘‘ఇజ్రాయెల్ అంటే హారిస్‌కు నచ్చదు. ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే రెండేళ్లలో ఆ దేశం కనుమరుగవుతుంది. బైడెన్ విధానాల కారణంగా అటు ఉక్రెయిన్‌లోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా చేస్తా’’ అని ట్రంప్ అన్నారు. ఇక వలసదారులపై ట్రంప్ మాట్లాడుతూ.. వారంతా పెంపుడు జంతువులను తింటున్నారని విమర్శించారు.
దీనికి హారిస్ దీటుగా బదులిచ్చారు. ‘‘ఇజ్రాయెల్‌కు తమను తాము రక్షించుకునే హక్కు ఉంది. కానీ, ఈ యుద్ధం ముగియాలని మేం కోరుకుంటున్నాం. ట్రంప్ నియంతలను ఆరాధిస్తారు. కిమ్ జోంగ్ ఉన్‌కు ఆయన ‘ప్రేమలేఖలు’ రాశారు. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్ (ఉక్రెయిన్ రాజధాని)లో కూర్చునేవారు. ఆయన తాలిబన్లతోనూ చర్చలు జరిపారు. ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారు. అమెరికా ప్రజలను విభజించేందుకు ఆయన విద్వేషాలను రెచ్చగొడుతున్నారు’’ అని ఉపాధ్యక్షురాలు మండిపడ్డారు.
డిబేట్ ప్రారంభంలో వీరిద్దరూ పలకరించుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. గత కొన్నేళ్లలో జరిగే సంవాదాల్లో అధ్యక్ష అభ్యర్థులెవరూ ఇలా డిబేట్‌కు ముందు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. వీరిద్దరూ ఆ సంప్రదాయానికి తెరతీశారు. ఆ తర్వాత మాటల యుద్ధం మొదలైంది. బైడెన్ పాలనలో తుపాకీ సంస్కృతి పెరగడం వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. దీన్ని హారిస్ ఖండించారు. మాజీ అధ్యక్షుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com