Kerala : తనయుడిని ఉగ్రవాదిగా మార్చేందుకు తల్లి యత్నం విఫలం

Kerala : తనయుడిని ఉగ్రవాదిగా మార్చేందుకు తల్లి  యత్నం విఫలం
X
టెర్రర్ కేసు దోషిని వివాహం చేసుకున్న బాలుడి తల్లి

కేరళలో 16 ఏళ్ల బాలుడిని ఐసిస్ ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కన్నతల్లే కుట్ర పన్నిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారించిన ఓ టెర్రర్ కేసులో దోషిగా తేలిన వ్యక్తితో కలిసి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, బాలుడి తల్లి ఫిదా మహమ్మద్ అలీ, ఐసిస్ కుట్ర కేసులో దోషి అయిన సిద్ధిక్‌ను వివాహం చేసుకుంది. సిద్ధిక్‌కు అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలుడిలో ఉగ్రవాద భావజాలాన్ని నింపేందుకు (రాడికలైజేషన్) తొలుత లండన్ తీసుకెళ్లారు. అయితే, బాలుడు వారి భావజాలాన్ని వ్యతిరేకించడంతో తిరిగి భారత్‌కు పంపించేశారు. అనంతరం సిద్ధిక్ ఆ బాలుడిని తిరువనంతపురంలోని అల్మియా అకాడమీ అనే మదరసాలో చేర్పించినట్టు అక్కడి ఉపాధ్యాయుడు ఉస్తాద్ అహ్మద్ తెలిపారు.

ప్రస్తుతం యూకేలో ఉంటున్న సిద్ధిక్ సోదరుడు అన్జర్‌కు కూడా తీవ్రవాద భావజాలం ఉందని, అతడు ఐసిస్ హత్యల వీడియోలు చూపించి తనను ఇబ్బంది పెట్టాడని బాలుడు తమతో చెప్పినట్టు ఉపాధ్యాయుడు వివరించారు. బాలుడి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై కేరళ డీజీపీ రవదా ఆజాద్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. బాలుడిని ఐసిస్ వైపు ఆకర్షించే ప్రయత్నం జరిగిందని, అతను నిరాకరించడంతో వెనక్కి పంపారని తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు అందగానే యూఏపీఏ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. సోదాల్లో లభించిన కొన్ని డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్టు వెల్లడించారు. ఈ కుట్ర వెనుక రాష్ట్రంలో స్లీపర్ సెల్స్ రూపంలో పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Next Story