Nigeria : నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్

పశ్చిమాఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు గురువారం ఓ పాఠశాలపై దాడి చేసి, 287 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. కడున స్టేట్‌లోని కురిగ టౌన్‌లో ఈ దారుణం జరిగింది. ఈ అపహరణకు బాధ్యత తమదేనని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. కడున గవర్నర్ ఉబ సాని ఈ పాఠశాలను సందర్శించి, ప్రజలకు సంఘీభావం తెలిపారు. అపహరణకు గురైన ప్రతి స్టూడెంట్‌ను తిరిగి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
నిన్న ఉదయం చికున్ జిల్లాలోని కురిగా స్కూల్ పై భారీ సంఖ్యలో సాయుధులు దాడికి దిగారు. ఓ టీచర్ ను, మరో 187 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. మరో పాఠశాలపై దాడి చేసి పెద్ద సంఖ్యలో చిన్నారులను అహపరించారు. అపహరణకు గురైన బాలలు 8 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న వారు. కిడ్నాప్ కు గురైన వారిలో పలువురు చిన్నారులు తప్పించుకున్నారు. కాగా, సాయుధ ముఠాల దుశ్చర్యపై నైజీరియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చిన్నారులను విడిపించేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి.
నైజీరియా ఉత్తర ప్రాంతంలోని పాఠశాలలపై సాయుధులు తరచూ దాడులు చేస్తూ, పెద్ద ఎత్తున అపహరణలకు పాల్పడుతూ, భారీగా సొమ్మును వసూలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సుమారు 200 మందిని అపహరించారు. వీరిలో అత్యధికులు మహిళలు, బాలికలే. నైజీరియాలో భద్రత దిగజారుతున్నదనడానికి ఈ రెండు సంఘటనలు ఉదాహరణలని పరిశీలకులు చెప్తున్నారు. బోలా టినుబు గత ఏడాది జరిగిన నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని, హింసకు తెరదించుతానని హామీ ఇచ్చారని, ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదని ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com