Burger : గర్లఫ్రెండ్ బర్గర్ తిన్నాడు..బాయ్ ఫ్రెండ్ చేతిలో చచ్చాడు!

పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ బర్గర్ తిన్నందుకు ఏకంగా తన స్నేహితుడిని హత్య చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరాచీకి చెందిన సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఎస్‌పీ) నజీర్ అహ్మద్ మీర్బహర్ కుమారుడు డానియల్ తన గర్ల్‌ఫ్రెండ్ షాజియాను ఇంటికి ఆహ్వానించాడు. ఆమె ఇంటికి చేరుకున్న సమయంలో అక్కడ అప్పటికే డానియల్ సోదరుడు అహ్మర్, స్నేహితుడు అలీ కిరియో ఉన్నారు. అయితే డానియల్ తనకు, తన గర్ల్ ఫ్రెండ్‌కు ఒక్కొక్కటి చొప్పున రెండు బర్గర్లను ఆర్డర్ పెట్టాడు. అవి వచ్చిన తర్వాత వాటిని తింటూ ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న డానియల్ స్నేహితుడు అలీ కిరియో, షాజియా తింటున్న బర్గర్ ముక్క కొరికాడు. దీన్ని చూసి కోపంతో ఊగిపోయిన డానియల్ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరి నుంచి తుపాకీని లాక్కొని అలీ కిరియోపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన అలీ కిరియోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. అలీ కిరియో స్థానిక సెషన్స్ జడ్జి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. వెంటనే నిందితుడు డానియల్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com