Kim Jong Un: 30 మంది అధికారులకు ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేసిన ఉత్తర కొరియా అధినేత

ఉత్తర కొరియాలో ఇటీవల తీవ్రమైన స్థాయిలో వరదలు వచ్చాయి. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 4 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే వరదల వల్ల ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un) కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 20 నుంచి 30 మంది అధికారులను ఉరి తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసిట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొన్నది. ఇటీవల చాగంగ్ ప్రావిన్సులో వచ్చిన వరదల వల్ల వేలాది మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు.
ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయిన అధికారులకు మరణ దండన విధిస్తున్నట్లు ఉత్తర కొరియాపై ఆరోపణలు వస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర కొరియా అధికారులు వెల్లడించారు. గత నెలలోనే వరద బాధిత ప్రాంతాలకు చెందిన 30 మంది అధికారులను ఉరితీసినట్లు చోసున్ టీవీకి చెందిన ఓ రిపోర్టు పేర్కొన్నది. మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 20-30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణకొరియా మీడియా ఓ కథనంలో ప్రచురించగా.. ఆ తరువాత కొద్ది రోజులకు వారందరికీ మరణశిక్ష అమలు చేశారని కథనంలో పేర్కొంది. అయితే సదరు అధికారుల వివరాలు, శిక్ష, అమలు తదితర విషయాలు బయటకు రాలేదు. మరణ శిక్షకు గురైన వారిలో చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విపత్తు సమయంలో అధ్యక్షుడు కిమ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించగా.. బాంగ్ హూన్‌ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు సైతం మరణ శిక్ష పడి ఉండవచ్చని దక్షిణ కొరియా మీడియా కోడై కూస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com