Kim Jong Un: కవ్విస్తే కాల్చేస్తాం .. మీకు వినాశనమే

Kim Jong Un:  కవ్విస్తే కాల్చేస్తాం .. మీకు వినాశనమే
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య సయోధ్య, విలీనం సాధ్యం కాదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తేల్చి చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా కవ్విస్తే.. వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సైన్యానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న కిమ్ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికా, దక్షిణ కొరియాలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు దేశాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. సైనిక ఘర్షణకు యత్నిస్తే అణ్వాయుధాలు వాడటానికి కూడా వెనకాడబోమని కిమ్ హెచ్చరించారు.దక్షిణ కొరియాతో ఎలాంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తేల్చి చెప్పారు. ఆదివారం మిలిటరీ కమాండర్ల సమావేశంలో ఈ విషయాల్ని కిమ్ ప్రస్తావించినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ-KCNA తెలిపింది. ఆ సమావేశంతో పాటు నూతన సంవత్సర వేడుకల్లో కిమ్ తన కూతురుతో పాల్గొన్న చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కిమ్‌ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఉత్తరకొరియా 100కు పైగా క్షిపణి పరీక్షలు చేసినట్టు గుర్తు చేస్తున్నారు.

1950 జూన్ 25న ఉత్తర కొరియా... దక్షిణ కొరియాపై దాడి చేయడంతో రెండు దేశాల మధ్య మూడేళ్ల పాటు శత్రుత్వం కొనసాగింది. ఆ సమయంలో ఉత్తర కొరియాకు చైనా, సోవియట్ యూనియన్ మద్దతు ఇచ్చాయి. దక్షిణ కొరియాకు అమెరికా, మిత్రదేశాలు మద్దతు తెలిపాయి. 1953 జూలై 27 న యుద్ధ విరమణతో పోరాటం ముగిసింది. అయితే సైనిక ఘర్షణ నిలిచిన నాటి నుంచి ఇరు దేశాలు విడిపోయాయి. కానీ ఎటువంటి యుద్ధ విరమణ ప్రకటన వెలువడలేదు. దీంతో సాంకేతికంగా మాత్రం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత ఇరు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకొన్నా చాలా కాలం వీటి సంబంధాలు ఉద్రిక్తంగానే సాగాయి. కిమ్‌ అధికారం చేపట్టాక.. ఇవి మరింత తీవ్ర స్థాయికి చేరాయి. గత వారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఉత్తరకొరియాలోని ఆయుధ తయారీదారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికాతో ఎటువంటి ఘర్షణ తలెత్తినా.. తట్టుకొనే విధంగా ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story