Kim Jong Un: కిమ్ వారసురాలిగా టీనేజ్ కూతురు కిమ్ జు యే .. కానీ

ఉత్తర కొరియాలో అధికార పీఠం కోసం ఓ ఆసక్తికరమైన కుటుంబ పోరుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా ఆయన టీనేజ్ కూతురు కిమ్ జు యే దాదాపు ఖరారైనట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) అంచనా వేసింది. ఇదే జరిగితే, భవిష్యత్తులో అధికారం కోసం తన అత్త, అత్యంత శక్తిమంతురాలైన కిమ్ యో జోంగ్‌తో ఆమె తలపడాల్సి రావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
13 ఏళ్ల వయసున్న కిమ్ జు యేను 'వారసురాలిగా నామినేట్ చేసే దశకు' చేరినట్లు ఎన్ఐఎస్ తాజాగా అంచనా వేసింది. గతంలో 'వారసురాలిగా శిక్షణలో ఉన్నారు' అని చెప్పిన నిఘా వర్గాలు ఇప్పుడు తమ అంచనాను మార్చడం గమనార్హం. 2022 నవంబర్‌లో తొలిసారిగా బయట కనిపించిన కిమ్ జు యే, అప్పటి నుంచి తండ్రితో కలిసి అనేక సైనిక, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అయితే ఈ వారసత్వానికి కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ నుంచి సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఉత్తర కొరియాలో రెండో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పార్టీలో, సైన్యంలో ఆమెకు గట్టి పట్టు ఉందని చెబుతారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు, కఠినమైన వైఖరితో ఆమె ఇప్పటికే తన సత్తా చాటుకున్నారు.
అవకాశం వస్తే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కిమ్ యో జోంగ్ ఏమాత్రం వెనుకాడరని, కాబట్టి అధికార పోరు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని దక్షిణ కొరియా మాజీ నిఘా అధికారి రా జోంగ్ యిల్ హెచ్చరించారు. కిమ్ కుటుంబ చరిత్ర కూడా రక్తసిక్తంగానే ఉంది. కిమ్ జోంగ్ ఉన్ తన మేనమామను, సోదరుడిని అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో జరగబోయే పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
