Korean Singer Dead : బాత్రూంలో విగత జీవిగా కనిపించిన సింగర్

కొరియన్ సినీ ఇండస్ట్రీలో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ లీ సాంగ్ యున్ మరణం అక్కడివారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. తన ప్రదర్శనకు కొద్ది నిమిషాల ముందే బాత్‌రూమ్‌లో ఆమె విగతజీవిలా కనిపించింది. జూలై 6న జరిగిన ఘటన ఆమె అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆమె మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరికాసేపట్లో ఆమె స్టేజ్ మీదకి రావాలి. తన పాటతో అందరినీ సమ్మోహన పరచాలి. సమయం మించిపోతున్నా తన జాడ లేదు. ప్రదర్శన ఇచ్చే హాల్ వద్దకు ఆమె ఎప్పుడో వచ్చిందని చుసినవాళ్లు చెప్పారు.. మరి స్టేజీ పైకి ఎందుకు రావడం లేదని సిబ్బంది వెతకడం ప్రారంభించారు. అప్పుడు కనిపించింది ఆమె.. శవంగా. జూలై 6 రాత్రి 8:23 గంటల సమయంలో మూడవ అంతస్తులోని మహిళల వాష్‌రూమ్‌లో ఆమె నిర్జీవంగా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎలా మరణించింది అనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
లీ సాంగ్ యున్ ప్రతిభావంతులైన సోప్రానో గాయకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సియోల్ నేషనల్ యూనివర్శిటీ నుండి పట్టభద్రులైన ఆమె న్యూయార్క్‌లోని మన్నెస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు.
కొరియన్ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. జులై 6 గురువారం ప్రముఖ సింగర్ కోకో లీ మరణించారనే వార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న లీ రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. జీర్ణించుకునే లోపే మరో పాపులర్ సింగర్ కన్నుమూశారనే వార్తతో పరిశ్రమ వర్గాలు దుఃఖం లో మునిగిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com