Titan : మునిగిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలం వెలికితీత..

అట్లాంటిక్ మహాసముద్రంలో శతాబ్దం క్రితం సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు ఐదుగురితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ విషాదకరంగా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ టైటాన్ చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డు వెలికితీసింది. టైటాన్‌కి సంబంధించి గతంలో కొన్ని భాగాలను ఉపరితలంపైకి తీసుకువచ్చారు. మిగిలిన అవశేషాలను సముద్రం అడుగు భాగాల నుంచి సేకరించినట్లు యూఎస్ కోస్ట్ గార్డు మంగళవారం తెలిపారు. వైద్య అధికారులు మానవ అవశేషాలను విశ్లేషిస్తున్నారు.
సముద్రంలో మునిగిపోయిన ఈ టైటానిక్ శకలాలను చూసేందుకు ఇప్పటికీ చాలామంది సాహసం చేస్తూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు. మునిగిపోయిన నౌక టైటానిక్ శిథిలాలను చూపించేందుకు ఓషన్ గేట్ అనే సంస్థ టైటాన్ అనే సబ్ మెర్సిబుల్‌ని రూపొందించింది. టైటానిక్ సినిమా తీసిన జేమ్స్ కామెరూన్ అయితే చాలాసార్లు వెళ్లివచ్చినట్లు తెలిపారు. అయితే కొన్ని నెలల క్రితం.. టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్లిన ఓ టైటాన్ సబ్‌మెర్సిబుల్.. నీటి అడుగున పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఈ ఘటన జరిగినప్పటి నుంచి అధికారులు సబ్ మెర్సిబుల్ శకలాల కోసం సముద్రంలో అన్వేషణ కొనసాగిస్తున్నారు. 114 రోజుల తర్వాత అట్లాంటిక్ సముద్రంలో మరికొన్ని శకలాలు, మానవ అవశేషాలను గుర్తించారు.
ప్రమాదానికి ముందు పలుమార్లు టైటాన్ విజయవంతంగా టైటానిక్ వద్దకు వెళ్లి వచ్చింది. అయితే ఈ ఏడాది ఇలాగే మరోసారి టైటాన్ సబ్‌మెర్సిబుల్ టైటానిక్ వద్దకు ప్రయాణమైంది. దీనిలో బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ప్రెంచ్ నేవీ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్, ఓషన్ గేట్ కంపెనీ చీఫ్ స్టాక్ టన్ రష్ మొత్తం ఐదుగురు ప్రయాణించి మృత్యువాతపడ్డారు.
సముద్రం అడుగుభాగంలోకి వెళ్లే కొద్ది నీటి ఒత్తిడి టైటాన్‌పై చాలా ఉంటుంది. అయితే అందుకు తగ్గట్లుగానే దీన్ని నిర్మించారు. ఇదే టైటాన్ పేలిపోయేందుకు కారణమైంది. 18 జూన్ 2023న సముద్రంలోకి వెళ్లిన టైటాన్ నుంచి కొద్ది సేపటికే కమ్యూనికేషన్ తెగిపోయింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలు అన్వేషణ కొనసాగించాయి. చివరికి టైటాన్ సబ్ మెర్సిబుల్. సముద్రం అడుగు భాగానికి వెళ్లిన కొద్దిసేపటికే పేలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇన్‌ప్లోజన్ అనే పేలుడు వల్ల టైటాన్ పేలిపోయింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఇది జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం జరుగుతోందో తెలిసేలోపేమరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com