Israel strikes: రఫా నగరంపై మరోసారి ఇజ్రాయెల్ దాడి:
గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్ వినిపించుకోవడం లేదు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వైద్యులు సోమవారం తెలిపారు. అయితే హమాస్ మాత్రం 15 మంది చనిపోయినట్లుగా మీడియాకు వెల్లడించింది. గాజా సిటీలోని ఇళ్లపై ఇజ్రాయెల్ విమానాలు దాడి చేశాయి. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం కలవరం రేపుతోంది. ప్రస్తుతం రఫాలోనే పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు పాల్పడింది. వందలాది మందిని చంపి.. మరికొందరిని బందీలుగా తీసుకుపోయారు. అనంతరం ప్రతీకారంగా హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఇప్పటికే గాజా పట్టణాన్ని సర్వనాశనం చేసింది. అలాగే హమాస్ చెరలో ఇంకా ఇజ్రాయెలీయులు బందీలుగా ఉన్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య విరమణ ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో మరోసారి ఎటాక్ చేయడంపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో సాయం చేసేందుకు అమెరికాలో చర్యలో చేపట్టింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఈవారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హమాస్ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని బైడెన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తద్వారా కాల్పుల విరమణ, గాజా పునఃనిర్మాణం దిశగా ముందడుగు వేయాలని హమాస్‌కు సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్ భద్రత విషయంలో అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్ హామీ ఇచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com