Pakistan: పాక్‌లో వరుసగా ఉగ్రవాదుల హత్యలు

ఒకప్పుడు బాంబుదాడులతో అమాయకులను బలితీసుకుని భయోత్పాతం సృష్టించిన పాకిస్థాన్ ఉగ్రవాదులకు ప్రాణభయం పట్టుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతుండటంతో చాలామంది మంది ఉగ్రవాదులు రహస్యప్రదేశాల్లో దాక్కుంటున్నారు. తాజాగా లష్కరే తోయిబా ఉగ్రనేత అక్రమ్ ఖాన్ ఘాజీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. 20నెలల్లో హత్యకు గురైన 19వ ఉగ్రవాది. అక్రమ్ ఖాన్ 2018-2020 మధ్యలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం నియామకాలు చేపట్టేవాడు. రెండేళ్ల నుంచి కశ్మీర్ లోయలోకి చొరబడిన ఉగ్ర మూకలకు భారత్‌కు వ్యతిరేకంగా విషం నూరిపోసేవాడు. ఖైబర్ పక్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో బజార్ జిల్లాలో బైకుపై వచ్చిన ఇద్దరు సాయుధులు అక్రమ్ ఖాన్‌ను కాల్చిచంపారు. ఈ విషయం బయటకు రాకుండా పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రయత్నించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ హత్యతో అప్రమత్తమైన పాక్ దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థులు, ఇతర ఉగ్ర గ్రూపుల పాత్ర, లష్కరేలో అంతర్గత విభేదాలను పరిశీలిస్తున్నాయి. మూడునెలల్లో లష్కరేకు చెందిన టాప్ కమాండర్లు హతంకావడం ఇది రెండోసారి.
సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఒక మసీదు బయట లష్కరే సీనియర్ కమాండర్ రియాజ్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నియంత్రణలోనే లష్కరే సంస్థ పనిచేస్తోంది. ఈవారంలోనే హత్యకు గురైన షాహిద్ ఖ్వాజా కూడా లష్కరే ఉగ్రవాదే. 2018లో భారత్‌లోని సుంజ్వాన్ సైనిక శిబిరంపై జరిగిన దాడితో ఇతనికి ప్రమేయం ఉంది. ఈ వరుస హత్యల్లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు కూడా గట్టిదెబ్బలు తగిలాయి. గతనెలలో జైషే చీఫ్ మసూద్ అజర్‌కు అత్యంత సన్నిహితుడైన దావుద్ మాలిక్‌ను ఉత్తర వజీరిస్థాన్‌లో పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. హిజ్బుల్ చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితడు ముఫ్తీ ఖైజర్ ఫారుఖీ కరాచీ నడిబొడ్డున హత్యకు గురయ్యాడు. ఈ ఘటన లష్కరే ఉగ్రసంస్థకు పెద్ద ఎదురుదెబ్బగామారింది. ఐసీ-814 విమానం హైజాక్‌లో కీలకపాత్ర పోషించిన జైషే ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపారు. మేనెలలో ఖలిస్థానీ కమాండో ఫోర్స్ అధినేత పరంజీత్ సింగ్ పన్వార్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు లాహోర్‌లో కాల్చిచంపారు. జైషే ఆత్మాహుతి దాడుల బృందానికి చీఫ్ హ్యాండ్లర్‌గా ఉన్న షాహిద్ లతీఫ్‌ను అక్టోబర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. ఇతని బృందమే పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడి చేసింది. ఈ వరుస కాల్పుల ఘటనతో ఉలిక్కిపాటుకు గురైన పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పదుల సంఖ్యలో ఉగ్రవాదులను సురక్షితప్రాంతాలకు తరలించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com