Pakistan: లష్కరే తోయిబా ఉగ్రవాది అమీర్ హంజాకు తీవ్రగాయాలు..

లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడు అమీర్ హంజాకు అనుమానాస్పద స్థితిలో తీవ్రంగా గాయపడ్డాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కి అమీర్ హంజా అత్యంత సన్నిహితుడు. ఈ ఉగ్రసంస్థ 17 మంది సహ వ్యవస్థాపకుల్లో హంజా కూడా ఒకడు. లష్కరే ప్రధాన సిద్ధాంతకర్తగా హంజా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతను ఆప్ఘనిస్తాన్‌లో అప్పటి సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా పోరాడాడు. ఆ తర్వాత హఫీజ్ సయీద్‌తో చేతులు కలిపాడు.
లష్కరే తోయిబా కేంద్ర సలహా కమిటీ సభ్యుడిగా కూడా పనిచేసిన హంజా, ఇతర ఉగ్రవాద సంస్థలతో లష్కరే సంబంధాలను కొనసాగించేలా చేశాడు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, హంజా అతని నివాసంలో గాయపడినట్లు తెలుస్తోంది. లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే, గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డాడా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో హంజాపై కూడా ఎవరైనా దాడి చేశారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com