Operation Sindoor: మరణించిన ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’తో చేపట్టిన ఈ సైనిక చర్యలో సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ దాడి తర్వాత పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో హతమైన పలువురు ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహించారు. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ప్రార్థనలకు నేతృత్వం వహించాడు. నిషేధిత జమాత్-ఉద్-దవా (జేయూడీ) సభ్యులతోపాటు పాకిస్థాన్ ఆర్మీ, పోలీస్, పౌర అధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముర్దికేలో పాకిస్థాన్ జెండాలు కప్పిన శవపేటికలను పాక్ ఆర్మీ సిబ్బంది మోశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. బుధవారం తెల్లవారుజామున 1 గంట నుంచి సుమారు అరగంట పాటు పాకిస్థాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. సవాయి నల్ల, సర్జల్, ముర్దికే, కోట్లి, కోట్లి గుల్పూర్, మెహమూనా జోయా, భీంబర్, బహవల్పూర్‌లోని లక్షిత ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. బహవల్పూర్ దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్ ఎ మొహమ్మద్ (జేఏఎం) చీఫ్ మసూద్ అజార్ చెప్పినట్లు బీబీసీ వెల్లడించింది.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్ సహా పలు దేశాలు ఆరోపిస్తున్నప్పటికీ, తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్థాన్ తరచూ పేర్కొంటోంది. అయితే, తాజాగా 'ఆపరేషన్ సిందూర్' లో మరణించినట్లు చెప్పబడుతున్న ముష్కరులకు పాకిస్థాన్ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఈ వాదనలను బలహీనపరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com