Los Angeles fires: వర్షాలు కురిసినా ఉపయోగం లేదు, సరికదా !

Los Angeles fires: వర్షాలు కురిసినా  ఉపయోగం  లేదు,  సరికదా !
X
విష పదార్థాలు కొట్టుకొస్తాయని లాస్‌ ఏంజెల్స్‌ వాసుల్లో ఆందోళన

అమెరికాలోని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనే వార్త ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కార్చిచ్చు కొనసాగుతుండగా, శనివారం నుంచి మొదలైన కొద్దిపాటి వర్షం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనే ఆందోళన తీవ్రమవుతున్నది.

ఈ వారాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ ప్రకటించింది. వర్షం నెమ్మదిగా, నిలకడగా కురిస్తేనే ఈ ప్రాంతానికి ప్రయోజనకరమని అధికారులు చెప్తున్నారు. కుండపోత వర్షాలు కురిస్తే, ఒకేసారి వరదలు వస్తాయని, ఫలితంగా విషపూరిత రసాయన పదార్థాలు కొండ దిగువ ప్రాంతాలకు కొట్టుకొస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వృక్షాలను తొలగించడం, ధ్వంసమైన రోడ్లను బాగు చేయడం వంటి పనుల్లో లాస్‌ ఏంజిల్స్‌ కౌంటీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ప్రాంతంలో వర్షం పడనున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో శనివారం రాత్రి చిన్నపాటి వర్షం మొదలుకాగా.. మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో కొన్ని వారాలుగా కార్చిచ్చు కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోన్న అనేక ప్రాంతాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

అయితే.. కొండప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్స్‌ సంభవిస్తే శిథిలాలు, బూడిద వంటివి దిగువ ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని, దీనికి సంబంధించి రెడీగా ఉండాలని అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ వెల్లడించింది. ముఖ్యంగా కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బ్యాటరీలు, భవన నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్లతో పాటు ఇతర వస్తువుల్లో ఉండే రసాయన పదార్థాలు, ఆస్బెస్టాస్‌, ప్లాస్టిక్‌, సీసం వంటివి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన కొనసాగుతోంది. ఈక్రమంలోనే.. కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Next Story