FRANCE: ఫ్రాన్స్ అధ్యక్షుడి ఇంటికి "తెగిన వేలు"

జాతీయ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ... ఫ్రాన్స్‌లో అలజడి రేగింది. ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్(Elysee palace)లో తెగిన వేలుతో ఉన్న ప్యాకేజీ కలకలం సృష్టించింది. అధ్యక్షుడి భవనానికి వచ్చిన ప్యాకెట్‌లో మనిషి వేలు ఉందని, ఈ వారం ఆరంభంలోనే ఇది వచ్చిందని పారిస్ ప్రాసిక్యూటర్ అధికారి(Paris prosecutor) వెల్లడించారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేలుతో ఉన్న ప్యాకేజీలో ఎలాంటి నోట్ లేదని... వేలును అధ్యక్షుడికి ఎందుకు పంపారో స్పష్టంగా తెలియదని అధికార వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష భవనానికి వచ్చిన తెగిన మానవ వేలు(Chopped fingertip)ను మొదట ఫ్రిజ్‌లో ఉంచామని... తర్వాత దానిని పోలీసులకు అప్పగించామని అధికారులు వెల్లడించారు. పోలీసులు దానిని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ వేలు.. ప్యాకేజీని పంపించిన వ్యక్తిదే అయి ఉంటుందని ప్రాసిక్యూటర్ అధికారి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి మానసిక స్థితి సరిగా లేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై ఎలిసీ ప్యాలెస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల ఫ్రాన్స్ (France)లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న కొద్ది రోజులకే అధ్యక్ష భవనానికి ఇలా తెగిన వేలితో బెదిరింపులు వచ్చాయి. గత నెల పోలీసుల కాల్పుల్లో ఓ 17 ఏళ్ల యువకుడు మృతి చెందడటంతో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేలాది మంది ఆందోళనకారులు కొన్ని వారాల పాటు రోడ్లపై చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు ప్రభుత్వ భవనాలు, వాహనాలకు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com