Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
రిక్టర్‌ స్కేల్‌పై 6 గా నమోదు

రిక్టర్‌ స్కేల్‌పై దాదాపు 6 తీవ్రతతో అండమా నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.57 గంటలకు పోర్టు బ్లెయిర్‌ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూమి అంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని సమాచారం. . భూకంప కేంద్రం పోర్టు బ్లెయిర్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొంది. అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశాయి. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారులు ప్రకటించలేదు. దీనికి సమాంతరంగా పాకిస్థాన్‌లోనూ ఈ ఉదయం భూకంపం వచ్చినట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది. ఇది రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదయినట్టు వివరించారు.


అలాగే శుక్రవారం ఉదయం 8.50 గంటలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాంగిన్‌లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూకంప కేంద్రం పాంగిన్‌కు 221 కిలోమీటర్ల దూరంలో ఉందని ఎన్‌సీఎస్‌ తెలిపింది.

అయితే, హిందూ మహా సముద్రంలో రెండు భూకంపాలు సంభవించినట్లు సమాచారం. అండమాన్‌తో పాటు ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్ద భూమి ప్రకంపించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపానికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది.రెండు వారాల కిందట కూడా అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపాలు నమోదయిన విషయం తెలిసిందే.

ఇండియా, బర్మా ప్లేట్ సమీపంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు క్రియాశీలక భూకంపాల జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్లేట్‌లు తరుచూ కదులుతుండటంతో భూకంపాలు సర్వ సాధారణం. ఇవే ఒక్కోసారి సునామీలకు కారణమవుతుంటాయి. 2004లో వచ్చిన భూకంపం.. అండమాన్ నికోబార్ దీవులను అతలాకుతలం చేసింది. సునామీ సంభవించి ఇక్కడ 10 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు

Tags

Read MoreRead Less
Next Story