Earthquake : ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake : ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
X
7.6 తీవ్రతతో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌ను శుక్రవారం ఉదయం భారీ భూకంపం వణికించింది. దేశంలోని మిందానావో ప్రాంతంలోని దావో ఓరియంటల్ ప్రావిన్స్ తీరంలో సముద్ర గర్భంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పరిణామంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం ఉదయం 9:43 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఆ దేశ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఫివోల్క్స్) అధికారికంగా ప్రకటించింది. మనాయ్ పట్టణానికి తూర్పున సుమారు 62 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం ఉండవచ్చని ఫివోల్క్స్ హెచ్చరించింది.

మరోవైపు యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం కూడా భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలను ప్రమాదకరమైన సునామీ అలలు తాకే ముప్పు ఉందని తెలిపింది. రాబోయే రెండు గంటల్లో పసిఫిక్ తీరంలో దాదాపు ఒక మీటరు ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ సీస్మాలజీ కార్యాలయం అంచనా వేసింది.

తొలుత యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్), యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్‌సీ) భూకంప తీవ్రతను 7.4గా నమోదు చేశాయి. అయితే, స్థానిక పరిస్థితులను అంచనా వేసిన ఫిలిప్పీన్స్ ఏజెన్సీ దానిని 7.6గా సవరించింది. పసిఫిక్ మహాసముద్రంలోని "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రాంతంలో ఫిలిప్పీన్స్ ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.

Tags

Next Story