మహాత్మాగాంధి ముని మనవరాలికి 7 సంవత్సరాల జైలు శిక్ష..

మహాత్మా గాంధీ 56 ఏళ్ల ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్ రూ. 3.22 కోట్లు మోసం మరియు ఫోర్జరీ కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ డర్బన్ కోర్టు తీర్పు చెప్పింది.
గాంధీజీ మనవరాలు, దక్షిణాఫ్రికాలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె లతా రామ్‌గోబిన్. అహింసపై ఏర్పాటైన ఓ ఎన్‌జీవోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2015 ఆగస్ట్‌లో న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ఎస్ఆర్ మహారాజ్‌ను కలిశారు. అతని సంస్థ దుస్తులు, మరియు పాదరక్షలను దిగుమతి చేసుకుని తయారు చేసి విక్రయిస్తుంది. దాంతో పాటు ఇతర సంస్థలకు లాభ-వాటా ప్రాతిపదికన ఫైనాన్స్‌ను అందిస్తుంది. ఈ కంపెనీ డైరెక్టర్ ఎస్‌ఆర్ మహరాజ్‌ను, 2015లో లత కలిశారు.
దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం తాను భారత్ నుంచి మూడు లినెన్ కంటైనర్లను దిగుమతి చేసుకున్నానని, అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్ సుంకాలు చెల్లించలేకపోతున్నానని తెలిపారు. కంటైనర్లను తెప్పించుకునేందుకు తనకు కొంత ఆర్థిక సాయం అందించమన్నారు. ఇందుకు ప్రతిగా తనకు వచ్చే లాభాల్లో షేర్ ఇస్తానన్నారు.
లతా రాంగోబిన్ కుటుంబ పరపతి తెలిసిన మహరాజ్ ఆమెకు 6.2 మిలియన్ రాండ్ల నగదు ఇచ్చారు. అయితే కొన్ని రోజులకే ఆమె భారత్ నుంచి ఎటువంటి సరకు దిగుమతి చేసుకోలేదని ఆమె చూపించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవని తెలిసింది. దీంతో మహరాజ్ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2015లోనే కేసు విచారణ ప్రారంభం కాగా ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. సోమవారం తుది విచారణ జరిపిన డర్బన్ న్యాయస్థానం ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెకు శిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కోర్టు ఇవ్వలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com