Pakistan bomb blast : పోలియో డ్రైవ్ లక్ష్యంగా బాంబు దాడి..

పాకిస్థాన్‌లో పోలియోడ్రైవ్‌కు వ్యతిరేకంగా ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్నాయి. పోలీయో డ్రైవ్‌కు రక్షణ కల్పించే పోలీసులే లక్ష్యంగా బాంబు దాడులు చేస్తున్నాయి. చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేయడం వల్లపెద్దవాళ్లైన తర్వాత వాళ్లకు పిల్లలు పుట్టరన్న అపోహతో ఉగ్రవాదులు ఈ పోలియో డ్రైవ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాడులు చేస్తున్నారు.తాజాగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు మరణించగా 20మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా.... ఉగ్రవాదుల అపోహలు, క్రూరమైన విధానాలు మాత్రం మారడం లేదు. చిన్నారుల్లో అంగ వైకల్యం నివారించే పోలియో చుక్కల కార్యక్రమంపై అపోహాలతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.ప్రపంచంలోని అన్ని దేశాలు దాదాపుగా పోలియో నివారించగా... పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మాత్రమే పోలియో ఇప్పటికీ ఉంది. గత సంవత్సరం పాకిస్థాన్‌లో ఆరు పోలియో కేసులు నమోదయ్యాయి. వీటిని నివారించేందుకు ప్రభుత్వం పోలియో డ్రైవ్‌లు చేపట్టగా.. అపోహలతో స్థానికులు, ఉగ్రవాదులు పోలియో డ్రైవ్ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు.చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల.... పెద్దవాళ్లైన తర్వాత వాళ్లకు పిల్లలు పుట్టరన్న అపోహతో ఉగ్రవాదులు ఈ పోలియో డ్రైవ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. దాడులు చేస్తున్నారు. స్థానికులు కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం లేదు. 2021లో పాకిస్థాన్‌లో కేవలం ఒకే పోలియో కేసు నమోదవ్వగా.. 2023 వచ్చే సరికి ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. పిల్లల్లో తీవ్ర పక్షవాతాన్ని నిరోధించేందుకు పోలియో చుక్కలే మార్గమని ఎంత ప్రచారం చేసినా ముష్కరులకు పాక్‌లోని స్థానికులకు చెవికెక్కడం లేదు.
పాకిస్థాన్‌లో పోలియో డ్రైవ్‌లకు వ్యతిరేకంగా ఉగ్రమూకలు దాడులు చేస్తుండడంతో ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పిస్తోంది. అయినా దాడులు ఆగడం లేదు. తాజాగా పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలియో టీకాలు వేసే కార్మికులకు భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 20మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలోని మాముంద్ తహసీల్‌లో జరిగింది. పోలియో టీకా బృందాలకు భద్రతగా విధుల్లో చేరడానికి పోలీసులు వ్యాన్ ఎక్కినప్పుడు ఈ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బాంబు దాడితో ఆ ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఈ పేలుడులో మరణించిన.. గాయపడిన వారందరూ పోలీసులేనని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేపీకే అర్షద్ హుస్సేన్ తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండించారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుందన్నారు. ఈ దాడికి బాధ్యులని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com