Dhaka Airport : ఢాకా విమానాశ్రయంలో అగ్నిప్రమాదం.. విమాన రాకపోకలు నిలిపివేత

బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్ పోర్టులో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో అధికారులు విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను నిల్వ చేసే విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ లో మంటలు చెలరేగాయి.
బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం, విమానాశ్రయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహ్మద్ మసుదుల్ హసన్ మసుద్ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, అగ్నిమాపక సేవ, బంగ్లాదేశ్ వైమానిక దళ అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లు రద్దు చేశామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణం, నష్టం ఎంతవరకు జరిగిందనేది ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు డైలీ స్టార్ పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com