Ukraine : రష్యాకు షాకిచ్చిన ఉక్రెయిన్..!

Ukraine : ఉక్రెయిన్‌లో రష్యన్ బలగాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. దాడులు మొదలై ఎనిమిది రోజులైనా మారణహోమం ఆగడం లేదు. రెండు రోజులుగా గ్యాప్ లేకుండా విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు. ఇరుదేశాల సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా రష్యాకు మరో గట్టి షాక్ తగిలింది. రష్యన్ మేజర్ జనరల్ అండ్రీ సుఖోవిట్ స్కీ హతమైనట్లు తెలుస్తోంది. అటు.. తన గగన తలం మీదకు వచ్చిన రష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బకు కూల్చేసింది ఉక్రెయిన్. ఇప్పటికే ప్రధాన పట్టణాలపై ఫోకస్ చేసిన రష్యన్ బలగాలు ఖార్కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి.
ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన రష్యా.. ఇప్పుడు పూర్తిగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. రష్యా దాడులు తీవ్రతరం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, భవనాలపై కూడా దాడులు జరుపుతుండడం కలకలం రేపుతోంది. మరోవైపు మెట్రో స్టేషన్లు అక్కడ అండర్ గ్రౌండ్ బంకర్లుగా మారాయి. అక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది. కీవ్‌లోని మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. కీవ్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగర దాడుల్లో రష్యా దళాలకు, ఉక్రెయిన్ రెబల్స్ చేతులు కలిపారు.
తమ దేశం జెలెన్‌స్కీని ఉక్రెయిన్ చట్టబద్ధమైన అధ్యక్షుడిగా గుర్తిస్తుందని.. కానీ ఆయన రష్యా వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్‌ను డీమిలిటరైజ్ చేయడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. దేశంలో అంతర్యుద్ధాన్ని ముగిస్తానంటూ జెలెన్‌స్కీ ప్రజలకు బూటకపు హామీ ఇచ్చారని లావ్రోవ్ విమర్శించారు. దీంతో పాటు రష్యన్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారని, ఈ క్రమంలోనే వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ డీమిలిటరైజ్, అక్కడ నాజీ ప్రభావాన్ని తొలగించడమే రష్యా మిలిటరీ ఆపరేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్కసారి దేశాన్ని డీమిలిటరైజ్ చేశాక.. తాము ఎలా జీవించాలో ఉక్రెనియన్లు నిర్ణయించుకోవచ్చని అన్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే, అది అణ్వాయుధ యుద్ధమే అవుతుందన్నారు.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం తెలిపింది. నిన్నటి వరకు 10 లక్షలు మంది ఉక్రెయిన్‌ను వీడినట్లు పేర్కొంది. మరోవైపు యూఏఈ సహా పలు దేశాలు ఉక్రెయిన్ వలసదారులకు ఆశ్రయాన్ని నిరాకరిస్తున్నాయి. ఇతర దేశాల జోక్యం పెరిగితే ఉక్రెయిన్‌తో యుద్ధంలో అణ్వస్త్రాలను వాడడానికి కూడా రష్యా వెనకాడబోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి విదేశీయులు నానా కష్టాలు పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com